
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే దేశీయ విమాన ప్రయాణికులకు భారీ ఊరట లభించింది. ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఈఆర్‌ఏ) యూజర్ డెవలప్‌మెంట్ ఫీజును 30 శాతానికి పైగా తగ్గించింది. ప్రస్తుతం దేశీయ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న రూ.750 యూడీఎఫ్‌ను రూ.515కు తగ్గిస్తూ కొత్త టారిఫ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సవరించిన ఛార్జీలు 2026 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చి 2031 మార్చి 31 వరకు కొనసాగనున్నాయి.
దేశీయ ప్రయాణికుల కోసం విమానాశ్రయ నిర్వహణ సంస్థ ఒక్కో ప్రయాణికుడిపై రూ.580 యూడీఎఫ్ ప్రతిపాదించగా.. ఏఈఆర్‌ఏ దానికంటే తక్కువగా రూ.515ను ఖరారు చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా భారీ ఊరట కల్పించింది. ప్రస్తుతం ఉన్న రూ.1,500 యూడీఎఫ్‌ను రూ.1,030కు తగ్గించింది. విమానాశ్రయ నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన రూ.1,150 కంటే కూడా ఇది తక్కువగా ఉండటం గమనార్హం. విమానయాన సంస్థలపై పడే కొన్ని ఇతర ఛార్జీలను కూడా నియంత్రణ సంస్థ తగ్గించింది. కొత్త టారిఫ్ కాలానికి దేశీయ విమానాలకు ల్యాండింగ్ ఛార్జీని మెట్రిక్ టన్నుకు రూ.435గా, అంతర్జాతీయ విమానాలకు రూ.630గా నిర్ణయించింది.
కొత్త టారిఫ్ నిర్ణయంలో ఏఈఆర్‌ఏ కీలక మార్పులు చేసింది. ఈసారి ‘ఇన్‌క్రిమెంటల్ అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం విమానాశ్రయంలో చేపట్టే భారీ అభివృద్ధి పనుల ఖర్చును ముందుగానే ప్రయాణికులపై భారం వేయకుండా.. ఆయా ప్రాజెక్టులు పూర్తై వినియోగంలోకి వచ్చిన తర్వాతే విమానాశ్రయ ఛార్జీల ద్వారా ఖర్చును రికవరీ చేసేలా విధానం రూపొందించారు.
కొత్త టెర్మినల్ భవనాలు, రన్‌వేలు, ట్యాక్సీవేలు వంటి భారీ ప్రాజెక్టులు టారిఫ్ కాలం రెండో భాగంలో పూర్తయ్యే అవకాశం ఉన్నందున.. అవి ఇంకా వినియోగంలోకి రాకముందే వాటి ఖర్చును ప్రయాణికుల నుంచి వసూలు చేయకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రయాణికులపై ముందస్తు ఆర్థిక భారం తగ్గనుంది.
హైదరాబాద్ విమానాశ్రయ నిర్వహణ సంస్థ మొత్తం రూ.27,851 కోట్ల అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్‌ను ప్రతిపాదించింది. అయితే, టారిఫ్‌ల నిర్ణయం కోసం ఏఈఆర్‌ఏ రూ.11,683.49 కోట్లను ప్రాథమిక ARRగా పరిగణించింది. దీని ఆధారంగా ఒక్కో ప్రయాణికుడిపై సగటు ఆదాయాన్ని రూ.426.39గా నిర్ణయించింది. ఈ ప్రాతిపదికపైనే యూడీఎఫ్‌తో పాటు విమానాల ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను ఖరారు చేసింది.
మొత్తానికి, హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణించే దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త టారిఫ్ నిర్ణయం ఆర్థికంగా కొంత ఊరట కల్పించనుంది. ముఖ్యంగా దేశీయ ప్రయాణికుల యూడీఎఫ్‌లో రూ.235 తగ్గింపు రావడం వల్ల విమాన ప్రయాణ ఖర్చు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో, భవిష్యత్ అభివృద్ధి పనుల భారాన్ని ప్రస్తుత ప్రయాణికులపై ముందుగానే మోపకుండా ఏఈఆర్‌ఏ కొత్త విధానాన్ని అమలు చేయడం కీలక పరిణామంగా భావిస్తున్నారు.