
చార్మినార్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది అగ్ని మాపక శాఖ. ఉదయం 6 గంటల 16 నిమిషాలకు గుల్జార్ హౌస్ చౌరస్తాలో G ప్లస్ 2 భవనంలో మంటలు చెలరేగాయని సమాచారం వచ్చిందని, మొఘల్‌పురా ఫైర్ సిబ్బంది అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారని తెలిపింది. ఈ ప్రమాదంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు పైఅంతస్తులకు వ్యాపించాయని తెలిపింది అగ్ని మాపక శాఖ. మొదటి అంతస్తులో చిక్కుకున్న 17 మందిని తమ సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు ప్రకటించింది.
ప్రాణాలు తెగించి రెస్క్యూ ఆపరేషన్
ఫైర్ ఫైటర్స్ తమ ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా.. మంటలకు శరీర భాగాలు కాలిపోవడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ప్రమాదం జరుగగానే వెంటనే స్పందించామని అగ్నిమాపక శాఖ తెలిపింది.
అగ్ని ప్రమాదఘటనపై మాజీ మంత్రి హరీష్‌రావు దిగ్భ్రాంతి:
ఈ అగ్ని ప్రమాదఘటనపై మాజీ మంత్రి హరీష్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ అలసత్వానికి సామాన్యులు బలయ్యారని, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి.. అగ్నిమాపకశాఖపై సమీక్ష నిర్వహించాలని అన్నారు.
17 మంది మృతి
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, ఏడాదిన్నర చిన్నారి, ఏడేళ్ల చిన్నారి, నాలుగేళ్ల పిల్లలు ఆరుగురు ఉన్నారు. అలాగే మృతుల్లో నలుగురు 60 ఏళ్లపైబడిన వారు ఉండగా, ఐదుగురు 30 నుంచి 40 ఏళ్లలోపువారు ఉన్నారు. 17 మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఇది కూడా చదవండి: Fire Accident: గాఢనిద్రలో ఉండగా మంటలు.. చార్మినార్ అగ్ని ప్రమాదానికి అసలు కారణం ఏంటి?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి