Public Alert: మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
మామిడి పండ్లు తిన్న తర్వాత ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిన వారిలో 17 ఏళ్ల భువేశ్వరి చికిత్స పొందుతూ మృతి చెందింది. మామిడి పండ్లలో విషపదార్థాలు ఉన్నాయా లేదా ఇతర కారణాల వల్ల ఈ ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

హైదరాబాద్, జూన్ 9: హైదరాబాద్‌లోని నారాయణగూడకు చెందిన ఒక కుటుంబం మామిడి పండ్లు తిన్న తర్వాత అందరిరూ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇందుమతి ఆమె నలుగురు కుమార్తెలు మామిడి పండ్లు తిన్న వెంటనే వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వారందరినీ కాచిగూడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ 17 ఏళ్ల భువేశ్వరి మృతి చెందింది. మిగిలిన కుటుంబ సభ్యుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
మామిడి పండ్లు ఎక్కడివి?
బంధువు రేణుక నారాయణగూడ వాటర్ బోర్డు సమీపంలో ఆ మామిడి పండ్లు కొని ఇందుమతి ఇంటికి తీసుకువచ్చారు. మామిడి పండ్లు తిన్న తర్వాత అందరూ ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో స్థానికంగా కలకలం రేగింది. నారాయణగూడ పోలీసులు ఈ ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మామిడి పండ్లలో విషపదార్థాలు ఉన్నాయా? లేదా మరైదేనా కారణం చేత ఇలా జరిగాందా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెప్పుకొస్తున్నారు. ప్రమాదకరమైన రసాయ పదార్థాలతో మామిడి పండ్లను మాగించడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
