Hyderabad: రూ.300 కోట్ల ఆస్తులు.. 15 మంది బినామీలు.. అక్రమ ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ పీసీఎస్ డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. సోదాల్లో రూ.300 కోట్లకు పైగా ఆస్తులు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, రూ.43.6 లక్షల నగదు బయటపడగా, 15 మందికి పైగా బినామీల వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి.

Hyderabad: రూ.300 కోట్ల ఆస్తులు.. 15 మంది బినామీలు.. అక్రమ ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్..
Dsp Bhim Reddy

Updated on: Jul 07, 2026 | 8:01 AM

హైదరాబాద్‌లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS) విభాగంలో డీఎస్పీగా భీమ్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు.. హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ కాగానే అదుపులోకి తీసుకున్న అధికారులు.. నాంపల్లి ACB ఆఫీస్‌కి భీమ్‌రెడ్డిని తరలించారు. ఉస్మానియాలో వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లారు. అనంతరం భీమ్‌రెడ్డిని జడ్జి నివాసానికి తీసుకెళ్లి హాజరుపర్చారు. ఈ కేసులో భీమ్ రెడ్డికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు భీమ్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇటీవల భీమ్‌రెడ్డి నివాసాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు.. రూ.300 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించింది. ఆయన ఇంట్లో లభ్యమైన రహస్య డైరీ కీలకంగా మారింది. ఈ డైరీలో 15 మందికి పైగా బినామీల పేర్లు ఉన్నట్టు గుర్తించారు.

16 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు..

ఐదురోజుల క్రితం హైదరాబాద్‌ పీసీఎస్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న భీమ్‌రెడ్డి నివాసం, కార్యాలయం, బంధువులు, బినామీలకు చెందిన 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. దాడుల్లో సంచలనం విషయాలు వెలుగుచూశాయి. భీమ్‌రెడ్డితోపాటు ఆయన బినామీ ఇళ్లలో నిన్న సోదాలు చేసిన ACB అధికారులు సుమారు 300కోట్ల అక్రమాస్తులు ఉంటాయని అంచనా వేశారు. ఈ క్రమంలోనే.. ఆయన ఇంట్లో లభ్యమైన రహస్య డైరీ కీలకంగా మారింది. ఈ డైరీలో 15 మందికి పైగా బినామీలు ఉన్నట్టు గుర్తించారు. వీటి ఆధారంగా వారం క్రితం జరిగిన 3 కోట్ల ఆర్థిక లావాదేవీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వ్యవహారంలో త్వరలోనే బినామీలందరికీ నోటీసులు జారీ చేసేందుకు ACB అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే.. భీమ్‌రెడ్డికి చెందిన పలు బ్యాంక్ లాకర్లను కోర్టు అనుమతితో తెరిచి పరిశీలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ల్యాండ్ సెటిల్‌మెంట్ల విషయంలో కొంతమందితో పరిచయాలు ఉన్నట్టు పోలీసు వర్గాలు చెప్తుండటంతో ఆ కోణంలో ACB అధికారులు దృష్టి సారించే అవకాశం ఉంది.

సోదాల సందర్భంగా భీమ్ రెడ్డి నివాసం.. బినామిల నుంచి సుమారు రెండు కిలోల బంగారం, 20 కిలోల వెండి, రూ.43.6 లక్షల నగదు, 23 విదేశీ మద్యం సీసాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మణికొండ, టెలికాం నగర్ ప్రాంతాలలో ఓపెన్ ప్లాట్లు, ఇబ్రహీంబాగ్‌లో ఒక లగ్జరీ విల్లా ఉన్నాయని సమాచారం. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వందల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు సమాచారం.. అయితే.. భీమ్‌రెడ్డి వద్ద గతంలో పనిచేసిన ఒక మాజీ హోంగార్డు, వాచ్‌మన్ పేర్లపై కోట్లాది రూపాయల విలువైన బినామీ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించడం సంచలనంగా మారింది. అయితే.. సోదాల సమయంలో భీమ్‌రెడ్డి అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us