హైదరాబాద్‌లో డిజిటల్ అరెస్ట్.. వృద్ధ దంపతుల నుంచి రూ.64 లక్షలు కాజేసిన కేటుగాళ్లు!

హైదరాబాద్‌కు చెందిన 71 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, ఆయన భార్యను సైబర్ నేరగాళ్లు నాలుగు నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో భయపెట్టి రూ.64 లక్షలు కొల్లగొట్టారు. పహల్గాం ఉగ్రదాడి కేసులో మీ పేరు ఉందంటూ నకిలీ పోలీసు అధికారులు బెదిరించారు. బ్యాంకు ఖాతాల వెరిఫికేషన్ పేరుతో పలుమార్లు డబ్బులు బదిలీ చేయించారు..

హైదరాబాద్‌లో డిజిటల్ అరెస్ట్.. వృద్ధ దంపతుల నుంచి రూ.64 లక్షలు కాజేసిన కేటుగాళ్లు!
Hyderabad Digital Arrest Scam

Edited By:

Updated on: Aug 31, 2026 | 4:57 PM

హైదరాబాద్‌, ఆగస్ట్ 31: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధ దంపతులను ఏకంగా నాలుగు నెలల పాటు డిజిటల్ అరెస్ట్‌లో ఉంచి.. పోలీసులమంటూ భయపెట్టి రూ.64 లక్షలు కొల్లగొట్టారు. పహల్గాం ఉగ్రదాడి కేసులో మీ పేరు బయటపడిందంటూ నకిలీ పోలీసు అధికారులు బెదిరించడంతో బాధితులు వారి మాటలను నిజమని నమ్మి భారీ మొత్తాన్ని బదిలీ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

71 ఏళ్ల బాధితుడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. కొంతకాలం క్రితం ఆయనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి క్రెడిట్ కార్డు బాకీ ఉందని చెప్పాడు. తనకు ఎలాంటి క్రెడిట్ కార్డు లేదని బాధితుడు స్పష్టం చేయడంతో.. వెంటనే మరో వ్యక్తి వాట్సాప్ కాల్ చేశాడు. తాను ఐపీఎస్ అధికారినని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి.. బాధితుడి పేరు ఓ నేర విచారణలో బయటపడిందంటూ భయపెట్టాడు. సందీప్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించిన దర్యాప్తులో బాధితుడి పేరు బయటపడిందని, పహల్గాం ఉగ్రదాడి కేసులో ఆయనపై కేసు నమోదైందని నకిలీ అధికారి చెప్పాడు. అంతేకాకుండా బాధితుడి కుటుంబ సభ్యుల వివరాలను కూడా సైబర్ నేరగాళ్లు చెప్పడంతో ఆయన మరింత ఆందోళనకు గురయ్యాడు. అమెరికాలో ఉంటున్న తన మనవడి వివరాలతో పాటు.. మనవరాలు ప్రతిరోజూ వెళ్లే మార్గం గురించి కూడా నేరగాళ్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో వారు నిజంగానే పోలీసు అధికారులు అయి ఉంటారని బాధిత దంపతులు నమ్మారు.

ఇవి కూడా చదవండి

బాధితుల భయాన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. దంపతులు డిజిటల్ అరెస్ట్‌లో ఉన్నారని ప్రకటించారు. తమ ఆదేశాలను పాటించకపోతే కుటుంబ సభ్యులను డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. దర్యాప్తు కొనసాగుతోందని, బ్యాంకు ఖాతాలను వెరిఫై చేయాల్సి ఉందని చెప్పి పలుమార్లు డబ్బులు బదిలీ చేయించారు. ఇలా నాలుగు నెలల పాటు వివిధ కారణాలు చెబుతూ బాధితుడి నుంచి మొత్తం రూ.64 లక్షలు బదిలీ చేయించుకున్నారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ నేరగాళ్లు ఉపయోగించిన ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, డిజిటల్ లావాదేవీల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటూ ఎవరైనా బెదిరిస్తే వెంటనే అప్రమత్తం కావాలని పోలీసులు సూచిస్తున్నారు. నిజమైన పోలీసులు వీడియో కాల్‌లో విచారణ పేరుతో డబ్బులు బదిలీ చేయాలని, బ్యాంకు ఖాతాలను వెరిఫికేషన్ కోసం ఖాళీ చేయాలని ఎప్పుడూ ఆదేశించరని స్పష్టం చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us