భాగ్యనగరంలో ఎలప్పుడూ ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సర్వీసులు దూసుకుపోతుంటాయి. ఈ మధ్యకాలంలో జనాలు ఆర్టీసీ బస్సుల కంటే.. వీటిపైనే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇలా యాప్‌లో బుక్ చేస్తే చాలు.. క్షణాల్లో ఆ బైక్ మన ఇంటికొస్తుంది.. సరాసరి మన డెస్టినేషన్ పాయింట్‌కి చాలా సులభంగా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్తుంది. అందుకేనేమో.. ఇటీవల ఈ సంస్థలకు చెందిన బైక్ సర్వీసులు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే తాజాగా ఓ బైక్ రైడర్‌కు వింత అనుభవం ఎదురైంది. కస్టమర్ చేసిన పనికి ఏం చేయాలో తెలియక.. రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. బైక్‌లో పెట్రోల్ అయిపోయినా.. కస్టమర్ దిగకపోవడంతో.. ఏం చేయలేక అలాగే బండిని తోసుకుంటూ వెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన గమ్యస్థానానికి చేరుకునేందుకు ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకున్నాడు. ఇలా బుక్ చేసుకున్నాడో లేదో.. అలా బైక్ రైడర్ రయ్.. రయ్.. మంటూ వచ్చేశాడు. కస్టమర్‌ను బైక్ ఎక్కించుకున్నాడు. గమ్యస్థానానికి చేర్చేందుకు మ్యాప్‌ను ఫాలో అవుతున్నాడు. అయితే ఇంతలో మార్గం మధ్యలోకి వచ్చేసరికి బైక్‌లో పెట్రోల్ అయిపోయింది. ఆ సమయంలో చుట్టుప్రక్కల పెట్రోల్ బంకులు కూడా లేకపోవడంతో.. బైక్‌ను తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంచెం బంకు వరకు నడుచుకుంటూ రావాలని కస్టమర్‌ను కోరాడు బైక్ రైడర్. దానికి కస్టమర్ ససేమిరా నో చెప్పేశాడు. ఇక ఏం చేయాలో తెలియక అలాగే కస్టమర్‌ను బైక్‌పై కూర్చోపెట్టుకుని తోసుకుంటూ వెళ్లాడు. ఇక ఈ తతంగాన్ని వెనకాల నుంచి వస్తోన్న ఓ కారులోని వారు వీడియో తీసి.. ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అది క్షణాల్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. బంకు వరకు నడుచుకుంటూ వెళ్లలేరా ఆ మాత్రం.? అని కొందరు ప్రశ్నిస్తుంటే.. మనుషుల్లో మానవత్వం అనేది మంటగలిసిపోతోందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొందరు బైక్ రైడర్ పరిస్థితి చూసి జాలిపడ్డారు. కాగా, వీడియోలో చెప్పిన దాని ప్రకారం అయితే.. అతడు ర్యాపిడో బైక్ రైడర్ అని తెలుస్తోంది. కానీ కొన్నిసార్లు ఫేక్ వీడియోలు సైతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంటాయి. కాబట్టి అతడు ర్యాపిడో బైక్ రైడరేనా లేక వేరే సంస్థకు చెందిన రైడరో అన్నది మాత్రం క్లారిటీ లేదు. లేదా అది ఏమైనా స్టంటా అనేది తెలియాలి.