Hyderabad: నగరంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు.. ఇటీవల వరసగా..

హైదరాబాద్‌ పరిధిలో మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. నిర్భయ, దిశ ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు పడినప్పటికీ కొంతమంది మృగాళ్లలో ఎలాంటి మార్పు రావడం లేదు. నేడు అనేక రూపాల్లో మహిళల హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. మహిళలను రక్షించే బాధ్యత కేవలం పోలీసులు, ప్రభుత్వాలదే కాదు.. పౌర సమాజానిది కూడా. కుటుంబం నుంచి విద్యా సంస్థల వరకు స్త్రీలను గౌరవించే సంస్కృతిని పెంచాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.

Hyderabad: నగరంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు.. ఇటీవల వరసగా..
Woman (Representative image)

Edited By:

Updated on: Aug 23, 2023 | 8:23 AM

హైదరాబాద్ మహా నగరంలో వరుస ఘటనలతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. నెల వ్యవధిలోనే మహిళలు, బాలికలపై పలు దాడులు,
హత్య, అత్యాచారాలు ఘటనలు నమోదవ్వడం ఆందోళన రేకెత్తుస్తుంది. ఇటీవల హుమాయన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెవిటి, మూగ మహిళపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఇంట్లో ఎవరు లేని సమయాన్ని చూసి బాధితీరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. విజయనగర్ కాలనీలో నివాసం ఉండే బాధిత మహిళను అదే ప్రాంతంలో ఉండే సాయి అనే వ్యక్తి బాత్రూంలో బంధించి అత్యాచారం చేశాడు. బాధిత మహిళ మూగది కావడంతో రక్షించమని అరవడానికి కూడా కుదరలేదు. అనంతరం బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇక స్వాతంత్ర దినోత్సవం నాడు పోలీసులే గిరిజన మహిళ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనను మహిళ సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏకంగా రాష్ట్ర గవర్నర్ సైతం ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసి.. ఇన్సిడెంట్‌పై పూర్తి వివరాలు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.   ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేసిన అధికారులు.. మరొక ఎస్సైపై బదిలీ వేటు వేశారు. ఇక యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసినటువంటి ఘటన జవహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను నిలువరించి.. బెదిరించి వివస్త్రను చెశాడు ఓ ప్రబుద్దుడు. దీంతో బయట అడుగు పెట్టాలి అంటేనే భయంగా ఉందంటున్నారు కొందరు మహిళలు. ఈ ఘటనలు మరవకముందే  జగద్గిరిగుట్ట,పేట్ బషీరాబాద్‌‌లో బాలికలపై అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి.

ఇలా రోజుల వ్యవధిలోనే సురారంలో ఇంటి నుండి బయటకు వచ్చిన మహిళ హత్యకు గురి అవ్వడం, అటు శంషాబాద్‌లో  మహిళను పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ఘటన, తాజాగా మీర్‌పేట్‌లో బాలికపై సామూహిక అత్యాచారం లాంటి భయంకరమైన, దారుణమైన ఘటనలు మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఖాళీ ప్రదేశాలు, నిర్మానుష్యమైన ప్రాంతాలు, రోడ్లపై.. పోలీసులు మరింత ఫోకస్ పెట్టాలి కోరుతున్నారు మహిళలు. గస్తీ పెంచడంతో పాటు నేరస్థులకు కఠిన శిక్షలు వేయడం ద్వారా కొంతమేర మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు. అంతే కాకుండా మహిళలపై దారుణమైన నేరాలకు పాల్పడేవారికి.. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..