Revanth Reddy: మా జోలికి వస్తే ఊరుకోం.. కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ ఎపిసోడ్‌పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..

|

Sep 15, 2024 | 9:58 PM

ప్రజలు విశ్వసించి కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా.. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు.

Revanth Reddy: మా జోలికి వస్తే ఊరుకోం.. కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ ఎపిసోడ్‌పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
Revanth Reddy
Follow us on

ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలను మరింత హీటెక్కించింది.. ఈ విషయంలో బీఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. ‘‘మా వాళ్ల ఇంటికి వస్తామని కొందరు సవాల్ విసిరారు.. మా వాళ్లే వాళ్లింటికెళ్లి బుద్ధి చెప్పారు.. మా ఇళ్లపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు.. అలాంటప్పుడు దమ్ముంటే రా అంటూ సవాల్ చేయడం ఎందుకు ?.. మా వాళ్లు ఎవరి జోలికి వెళ్లరు.. మా జోలికి వస్తే ఊరుకోం’’.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం టి.పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో నిర్వహించిన సభకు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మంత్రులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తే పదవికి రాజీనామా చేస్తానన్నా హరీష్‌రావు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్. రుణమాఫీ అయిన రైతుల వివరాలను ఆయనకు పంపిస్తామన్నారు. మహేష్‌కుమార్‌ గౌడ్ సౌమ్యుడు కాబట్టి.. ఊర్లలో తమ ఆటలు సాగుతాయని కొందరు అనుకోవచ్చు.. కానీ మహేష్‌కుమార్‌ గౌడ్ వెనుక తాను ఉన్నానంటూ పేర్కొన్నారు. ఎవరైనా తమ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు.

ప్రజలు విశ్వసించి కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా.. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లో.. మొదటి రెండు గ్యారంటీలు అమలు చేశామనితెలిపారు. గత ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీని నీరుగార్చిందని.. రాజీవ్‌ ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచామని గుర్తుచేశారు. ఆడబిడ్డలకు రూ.500కే గ్యాస్ సిలిండర్‌ అందిస్తున్నాన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమ చేశామని తెలిపారు.

ముచ్చెర్లలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడతామని.. ప్రపంచానికి ఆదర్శంగా అధునాతన నగరం నిర్మిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. రీజనల్‌ రింగ్‌రోడ్‌తో తెలంగాణ స్వరూపం మారుతుందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్.. 2029 ఫైనల్స్‌లో మనం ఘనవిజయం సాధించాలి.. రాహుల్‌గాంధీని ప్రధానిగా చేసినప్పుడే ఫైనల్స్‌లో విజయం సాధించినట్టు.. అంటూ పేర్కొన్నారు. రాబోయే పదేళ్లపాటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు సీఎం రేవంత్. 1994 నుంచి కొనసాగుతున్న పొలిటికల్ ట్రెండ్‌ గురించి వివరించారు.

మహేష్‌ కుమార్‌ గౌడ్ మాట్లాడుతూ.. గాంధీభవన్‌ దేవాలయంతో సమానమని.. కార్యకర్తలు దేవుళ్లతో సమానమని పేర్కొన్నారు. తన మార్గదర్శకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువ.. విమర్శించుకుంటాం.. అవసరం వస్తే కలిసి పనిచేస్తామంటూ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..