Chandanagar: చిన్నోడి మృతిపై ఎన్నో అనుమానాలు.. బాత్రూంలో అలా ఎలా…?

హైదరాబాద్‌ చందానగర్ పరిధిలో నాలుగో తరగతి చదువుతున్న ప్రశాంత్ మృతి కేసు మిస్టరీగా మారింది. ఇంటి బాత్రూమ్‌లో స్కూల్ ఐడీ కార్డుకు అనుమానాస్పదంగా వేలాడుతూ బాలుడు మృతి చెందడం పలు సందేహాలకు తావిస్తోంది. ఇది హత్యా, ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తూ జరిగిన మరణమా అనే కోణాల్లో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

Chandanagar: చిన్నోడి మృతిపై ఎన్నో అనుమానాలు.. బాత్రూంలో అలా ఎలా...?
Prasanth

Edited By:

Updated on: Dec 19, 2025 | 10:09 PM

హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగో తరగతి చదువుతున్న ప్రశాంత్ అనే విద్యార్థి మృతి మిస్టరీగా మారింది. తన ఇంట్లోని బాత్రూంలో స్కూల్ ఐడీ కార్డుకు అనుమానాస్పదంగా వేలాడుతూ బాలుడు మృతి చెందిన ఘటన పలు అనుమానాలకు దారి తీస్తోంది.
రోజు మాదిరిగానే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ప్రశాంత్ డ్రెస్ మార్చుకోవడానికి బాత్రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అయితే ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగా… బాత్రూమ్‌లో ఉన్న జియో వైర్‌కు స్కూల్ ఐడీ కార్డ్‌తో వేలాడుతూ బాలుడు విగత జీవిగా కనిపించాడు.

ఈ ఘటనను అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన చందానగర్ పోలీసులు… ఇది హత్యా? ఆత్మహత్యా? లేక ప్రమాదవశాత్తూ జరిగిన మరణమా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహానికి ఇప్పటికే పోస్ట్‌మార్టం నిర్వహించగా… ఆ రిపోర్ట్ ఈ కేసులో కీలకంగా మారనుంది.

ఘటన జరిగిన బాత్రూమ్ స్పాట్‌ను పోలీసులు మరోసారి పరిశీలించారు. బాత్రూమ్ వాల్ పొడవు, లోపల ఉన్న జియో వైర్ ఎత్తు, ఐడీ కార్డు ట్యాగ్‌తో ఈ తరహా ఘటన సాధ్యమా? అనే అంశాలపై క్లూస్ టీమ్‌తో కలిసి లోతుగా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా స్కూల్ ఐడీ కార్డ్ ట్యాగ్‌తో బాలుడు మరణించడం దర్యాప్తు అధికారులను కూడా నివ్వెరపాటుకు గురిచేస్తోంది.

ఇక బాలుడిపై స్కూల్‌లో ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? ఏమైనా మాటలు అన్నారా? మనస్తాపానికి గురయ్యాడా? అనే కోణంలో పోలీసులు స్కూల్‌కు వెళ్లి ఎంక్వైరీ చేపట్టారు. అంత్యక్రియలు పూర్తైన తర్వాత తల్లిదండ్రులను మరోసారి విచారించనున్నారు. ఇటీవల బాలుడు ఏదైనా కొనివ్వమని అడిగాడా? ముభావంగా ఉన్నాడా? అనే అంశాలపై కూడా పోలీసులు విశ్లేషణ చేస్తున్నారు. మొత్తంగా పలు కోణాల్లో ఈ కేసుపై చందానగర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..