కేంద్రం సహకారం లేకపోయినా హైదరాబాద్‌లో మెట్రోను విస్తరిస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు నిర్మించే మెట్రో రెండోదశ పనులకు శంకుస్థాపన చేశారు. రాయదుర్గం దగ్గర పూజలు చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పోలీస్ అకాడమీ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగానే మెట్రో విస్తరణపై కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ చుట్టూ ORRకు సమాంతరంగా మెట్రో రావాల్సిన అవసరం ఉందన్నారు. మియాపూర్ నుంచి BHEL వరకు పొడిగిస్తామని ప్రకటించారు. ట్రాఫిక్ సమస్యకు ప్రధాన పరిష్కారం మెట్రోనే అన్నారు సీఎం కేసీఆర్.
శంషాబాద్ వరకు మెట్రో పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు కేసీఆర్. మొత్తం 31 కిలోమీటర్ల మేర ఉండే రాయదుర్గం టు శంషాబాద్ రూట్‌లో రెండున్నర కిలోమీటర్లు భూగర్భ మార్గంలో, ఒక కిలోమీటరు రోడ్డుకు సమాంతరంగా మెట్రో వస్తుందన్నారు. ఎయిర్‌పోర్టులో రెండో రన్‌వే కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు.
హైదరాబాద్‌లో కరెంటు పోనే పోదన్నారు సీఎం కేసీఆర్. పవర్ గ్రిడ్‌తో నగరాన్ని అనుసంధనం చేశామని, పవర్ ఐలాండ్‌గా మార్చామని చెప్పారు. న్యూయార్క్, లండన్, ప్యారిస్‌లో విద్యుత్ పోతుంది కానీ హైదరాబాద్‌లో మాత్రం పోనే పోదన్నారు కేసీఆర్.
మెట్రో శంకుస్థాపన సందర్భంగా HMDA, GMR తరపున పది శాతం వాటా 625 కోట్ల చొప్పున చెక్కులను ప్రభుత్వానికి అందజేశారు. HMDA కమిషనర్ అర్వింద్‌కుమార్, GMR తరపున ఆ సంస్థ ప్రతినిధులు చెక్‌ను ముఖ్యమంత్రికి అందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం