
మటన్ తో పోలిస్తే నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా చికెన్ ను తింటారు. డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే.. ధరలు అందుబాటులో ఉంటాయన్న కారణంతో సామాన్యులు ఎక్కువగా చికెన్ ను కొనుగోలు చేసి తింటారు. అయితే.. ప్రస్తుత కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఎండలు.. పెళ్లిళ్ల సీజన్.. సరఫరా తగ్గుదల.. వెరసి చికెన్ ధరలు భారీగా పెరిగాయి. రోజురోజుకూ చికెన్, మటన్ ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు కొనాలా వద్దా అన్న పరిస్థితి నెలకొంది. వారం రోజుల నుంచి పరిశీలిస్తే చికెన్ (కోడి మాంసం) ధరలు అమాంతం 80 రూపాయల వరకు పెరిగింది. గతవారం కేజీ చికెన్ రూ.260 వరకు ఉండగా.. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.360 పలుకుతోంది.
తాజా చికెన్ రేట్ల ప్రకారం.. ఫామ్ రేట్ లైవ్ బర్డ్ (కోడి కిలో) 170 నుంచి 180 ఉంది. డ్రెస్సెడ్ చికెన్ రూ.320 -330 వరకు అమ్ముతున్నారు. స్కిన్ లెస్ రూ.350 నుంచి రూ.360 వరకు విక్రయిస్తున్నారు. గుడ్లు డజన్ రూ.72 నుంచి 75 వరకు విక్రయిస్తున్నారు. చికెన్ రేట్లు భారీగా పెరగడంతో మాంసం ప్రియులు కోడి మాంసం కొనాలంటే జంకుతున్నారు. ప్రస్తుతం ధరలు మరింత పెరగడంతోపాటు జూన్ నెలాఖరు వరకు ఇలానే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.
వేసవి తీవ్రత కారణంగా కోళ్ల మరణాలు పెరగడం, ఫారాల్లో ఉత్పత్తి తగ్గడం వల్ల మార్కెట్‌లో సరఫరా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు పెళ్లిళ్లు, ఫంక్షన్లు, హోటళ్ల నుంచి డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. మటన్ రేట్లు సైతం భారీగా పెరిగాయి.. మార్కెట్లలో కేజీ మటన్ 1100లకి పెరగగా.. బోన్ లెస్ మటన్ రూ.1300 ల వరకు చేరింది.
అయితే.. మార్కెట్‌లలో మటన్, చికెన్ రేట్లు ప్రాంతానికోలా మారుతున్నప్పటికీ.. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..