Balapur Ganesh Laddu: రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డు వేలం.. ఎవరు దక్కించుకున్నారంటే..
Balapur Ganesh Laddu Auction: హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బాలాపూర్ లడ్డూకు ఈసారి మరింత డిమాండ్ పెరిగింది. ఏటా నిర్వహించే లడ్డూ వేలంలో ఈసారి కంపెనీలు కూడా పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. 32 ఏళ్లుగా వ్యక్తిగతంగా కొనసాగుతున్న..

Balapur Ganesh Laddu Auction: హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బాలాపూర్ లడ్డూకు ఈసారి మరింత డిమాండ్ పెరిగింది. ఏటా నిర్వహించే లడ్డూ వేలంలో ఈసారి కంపెనీలు కూడా పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. 32 ఏళ్లుగా వ్యక్తిగతంగా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు, వేలంపాటలో తొలిసారిగా కంపెనీల భాగస్వామ్యం చర్చనీయాంశంగా మారింది. అయితే తాజగా బాలాపూర్ లడ్డును సామ ప్రణిత్ రెడ్డి రూ.39 లక్షలకు దక్కించుకున్నారు.
బాలాపూర్ లడ్డూ వేలం కోసం ఈసారి మొత్తం 9 మంది దరఖాస్తుదారులు ముందుకొచ్చారు. వీరిలో ఏకంగా ఐదు కంపెనీలు ఉండటం విశేషం. ఇప్పటివరకు వ్యక్తులు మాత్రమే లడ్డూ వేలంలో పాల్గొంటూ వచ్చారు. అయితే ఈసారి కంపెనీలు కూడా పోటీకి రావడంతో లడ్డూ వేలంపై ఆసక్తి మరింత పెరిగింది. బాలాపూర్ లడ్డూకు ఉన్న ప్రత్యేక గుర్తింపు, సెంటిమెంట్‌తో పాటు వేలంలో లడ్డూను దక్కించుకున్న వారికి లభించే ప్రచారం కూడా కంపెనీలను ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. బాలాపూర్ లడ్డూ వేలం కేవలం ప్రసాదం కోసం జరిగే కార్యక్రమం కాకుండా.. తెలంగాణలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఓ సంప్రదాయంగా కొనసాగుతోంది.
ఈ లడ్డూను దక్కించుకున్న వ్యక్తులు లేదా సంస్థలకు సామాజికంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. దీంతో ఈసారి కంపెనీలు కూడా వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి. బాలాపూర్ లడ్డూ వేలం ప్రతి ఏడాది కొత్త రికార్డులు సృష్టిస్తూ వస్తోంది. గతేడాది లడ్డూ రూ.35 లక్షలకు వేలం పలికింది. ఈసారి కంపెనీలు కూడా పోటీలోకి రావడంతో వేలం మరింత ఉత్కంఠకు దారి తీసింది. అయితే గత ఏడాదికంటే ఈ సారి రూ. 4 లక్షలు పెరిగింది.
