హైదరాబాద్‌లో దారుణం.. లాయర్‌ను కారుతో ఢీకొట్టి..

హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లో అడ్వొకేట్‌ ఖాజా మొయినుద్దీన్‌ దారుణ హత్య కలకలం రేపింది. కారు ఎక్కుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నంబర్‌ప్లేట్‌ లేని కారుతో ఢీకొట్టి పరారయ్యారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మొయినుద్దీన్‌ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో కేసు సంచలనంగా మారింది.

హైదరాబాద్‌లో దారుణం.. లాయర్‌ను కారుతో ఢీకొట్టి..
Advocate Khaja Moinuddin Murder

Updated on: May 23, 2026 | 6:09 PM

హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లో అడ్వొకేట్‌ ఖాజా మొయినుద్దీన్‌ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు నంబర్‌ ప్లేట్‌ లేని కారుతో ఢీకొట్టి హత్య చేయడం సంచలనంగా మారింది. ఉదయం ఇంటినుంచి బయటకు వచ్చిన కారు ఎక్కుతున్న సమయంలో కొందరు వ్యక్తులు వెనుకనుంచి వచ్చి కారుతో ఢీకొట్టి పరారయ్యారు. మొయినుద్దీన్‌కి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

మొయినుద్దీన్‌ను దుండగులు కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వెనుక సీటులో బ్యాగ్‌ పెట్టి.. డ్రైవింగ్‌ సీట్‌లోకి ఎక్కేలోపు దుండగులు కారుతో దూసుకొచ్చారు. అయితే.. కారును గమనించి తప్పించుకునేలోపే ఢీకొట్టడంతో సుమారు 100 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలతో కారును ట్రేస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నాంపల్లి సీఐ సైదులు తెలిపారు. హత్యకు కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఖాజా మోయినుద్దీన్ వాదించిన కేసుల వివరాలను పరిశీలిస్తున్నారు. గతంలోని కేసులకు సంబంధించి ప్రత్యర్థులే హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు.. అడ్వొకేట్‌ ఖాజా మొయినుద్దీన్‌ హత్యపై ఆయన కుమారుడు ఫర్హాన్‌ కీలక విషయాలు వెల్లడించారు. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు పోరాటం చేస్తుడటంతోనే ప్రత్యర్థులు హత్య చేశారని ఆరోపించారు. ప్రధానంగా.. ఆలంఖాన్ ఫ్యామిలీ అక్రమాలపై కేసులు వేసి.. వాదిస్తుండటంతోనే హత్యకు పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఆఫీసులకు వచ్చి మరీ దాడులు చేశారని.. ఇప్పుడు ఏకంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తనకు ఏం జరిగినా ఆలంఖాన్‌ ఫ్యామిలీదే బాధ్యత అన్నారు ఖాజా మొహిజుద్దీన్‌ కుమారుడు ఫర్హాన్..

వీడియో చూడండి..

లాయర్ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. అయితే.. మలక్‌పేట్‌లోని వక్ఫ్ బోర్డు ఆస్తుల వివాదాలతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక భూ మాఫియా ముఠా ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ రక్షిత కృష్ణమూర్తి మీడియాతో అన్నారు.

పోలీసుల కథనం ప్రకారం, మొయినుద్దీన్ వక్ఫ్ భూముల పరిరక్షణకు సంబంధించిన పలు సున్నితమైన కేసులను చురుకుగా నిర్వహిస్తూ, వాటిలో జోక్యం చేసుకుంటున్నారని, అలాగే అక్రమ ఆక్రమణ ప్రయత్నాలను వ్యతిరేకించారని సమాచారం.. దీంతో ముఠా హత్య చేసి ఉండొచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై మొదట హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసినప్పటికీ, సంఘటన జరిగిన పరిస్థితులను పరిశీలించిన తర్వాత సెక్షన్లను మార్చి దానిని హత్య కేసుగా నమోదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us