Hyderabad: మీ పిల్లలు పతంగి ఎగురేసేటప్పుడు జాగ్రత్త.. కరెంట్ వైర్లలో చిక్కుపోయిన కైట్‌ను తీయబోయి..

|

Jan 13, 2024 | 12:30 PM

అత్తాపూర్‌లో శుక్రవారం పతంగులు ఎగురవేస్తుండగా విద్యుదాఘాతంతో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. తనిష్క్ గాలిపటాలు ఎగురవేస్తుండగా టెర్రస్‌పై ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్ పి యాదగిరి తెలిపారు.

Hyderabad: మీ పిల్లలు పతంగి ఎగురేసేటప్పుడు జాగ్రత్త.. కరెంట్ వైర్లలో చిక్కుపోయిన కైట్‌ను తీయబోయి..
Kite (Representative image)
Follow us on

అత్తాపూర్‌లో సంక్రాంతి పండుగకి ముందు ఓ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి..గాలి పటాలు ఎగుర వేయడానికి తన ముగ్గురు స్నేహితులతో కలిసి మేడ మీదకు వెళ్లాడు తనిష్క్…అక్కడ గాలిపటం ఎగరవేశాడు కూడా.. అయితే కాసేపటికి ఆ గాలిపటం వెళ్లి విద్యుత్‌ తీగల్లో చిక్కుకుపోయింది. దీంతో ఆ గాలిపటానికి తీసేందుకు ప్రయత్నించాడు తనిష్క్..అప్పుడే ఒక్కసారిగా కరెంట్‌షాక్‌ తగిలి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు..హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా..అప్పటికే బాలుడు మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు..దీంతో తనిష్క్‌ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

సంక్రాంతి అంటే పతంగులు.. ఆట పాటలతో సరదాగా గడపడమే. కానీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పట్టణాల్లో కరెంట్ పోల్స్ భవంతులకు అనుకుని ఉంటాయి. ఆ కరెంట్ వైర్లలో పతంగులు పదే, పదే చిక్కుకుపోతూ ఉంటాయి. తెలియక పిల్లలు కర్రలతో, చేతికి దొరికిన వస్తువులతో ఆ పతంగిని అందుకునే ప్రయత్నం చేస్తారు. వారికి బొత్తిగా అవగాహన ఉండదు. సో.. పిల్లలు కైట్స్ ఎగరేసేటప్పుడు పేరెంట్స్ పక్కనే ఉండటం ఉత్తమం. అంతేకాదు.. కరెంట్ వైర్లలో చిక్కుకుంటే దాని జోలికి వెళ్లవద్దని వారికి ముందుగానే గట్టిగా చెప్పాలి.

చైనా మాంజాతో జాగ్రత్త….

కైట్‌ ఎగరేస్తుంటే వచ్చే ఆనందమే వేరబ్బా. కానీ ఆ పతంగి పైపైకి ఎగరాలన్న పోటీకి ప్రాణాంతకమైన మాంజాను వాడుతున్నారు. దారానికి గాజు పెంకుల పొడి పూసి మాంజాను తయారు చేస్తున్నారు. అదే ఇప్పుడు మనుషులకే కాదు జంతువులు, పక్షులకు కూడా ప్రమాదకరంగా మారింది. పతంగులను ఎగురవేసేందుకు వినియోగిస్తున్న చైనా మాంజా వల్ల పర్వావరణానికి, పక్షులకు, జంతువులకు, గాలిపటాలు ఎగురవేసే వారికి సైతం గాయాలవుతున్నాయి. ఇలా ఇప్పటివరకు మాంజా కాళ్లకు చుట్టుకుని బర్డ్స్‌ మాత్రమే కాదు మనుషులు కూడా చనిపోయిన ఘటనలను చూశాం. చూస్తున్నాం..

పతంగులను ఎగురవేసే సమయంలో.. కాంపిటీటర్‌ కైట్‌ను కట్‌ చేసేందుకు చైనా మాంజా వాడుతున్నారు. ప్లాస్టిక్‌ దారానికి గాజుపొడి అద్ది దీన్ని తయారు చేస్తారు. పక్కవాడి కైట్‌ని కట్‌ చేసి గెలిచినా.. అదే ప్రాణాలను తీస్తోంది. ఎందుకంటే… పతంగి ఎగుర వేసే వారితో పాటు.. పక్కనున్న వారి చేతులకూ గాయాలవుతున్నాయి. పతంగులు ఎగురవేస్తున్న సమయంలో చెట్లకు, విద్యుత్‌ స్తంబాలకు పతంగులతో పాటు చైనా మాంజా చిక్కుకోవడంతో మాంజాకు తగిలే పక్షులు, జంతువులకు కూడా హాని కలుగుతోంది. పక్షుల మెడకు, కాళ్లకు మాంజా చుట్టుకొని అవి మృత్యువాత పడుతున్నాయి.

ఈ చైనా మాంజాను అమ్మినా.. కొన్నా నేరమే. ఇందుకోసం 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కొత్త జీవోను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం అమ్మినా.. కొన్నా శిక్షార్హులని ప్రభుత్వం వార్నింగ్‌ ఇస్తోంది. జైలు శిక్షతో పాటు.. లక్ష వరకు ఫైన్‌ కూడా ఉంది. ఇలాంటి వారు ఎవరైనా మీ కంట పడితే.. మీ సమీపంలోని పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..