Hyderabad: గతంలో రాత్రి చేసే పనులు.. ఇప్పుడు పట్టపగలే.. వీళ్లు ఏం చేస్తున్నారో మీరే చూడండి..

ఉప్పల్ భగాయత్.. ఒకప్పుడు ప్రశాంతమైన లేఅవుట్, ఇప్పుడు ఆకతాయిల అడ్డా.. పట్టపగలే బైక్ రేసింగ్‌లు, అర్ధరాత్రి గంజాయి బ్యాచ్‌ల హల్చల్‌తో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ ఆగడాలపై మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ కు అపార్ట్‌మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. అసలు ఉప్పల్ భగాయత్ రోడ్లపై జరుగుతున్న అరాచకాలేంటి? అనే విషయాలు తెలుసుకుందాం..

Hyderabad: గతంలో రాత్రి చేసే పనులు.. ఇప్పుడు పట్టపగలే.. వీళ్లు ఏం చేస్తున్నారో మీరే చూడండి..
Uppal Residents Panic By Bike Racers

Edited By:

Updated on: Apr 25, 2026 | 9:43 PM

హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్ ఇప్పుడు భయం గుప్పిట్లో ఉంది. ముఖ్యంగా ఉప్పల్ భగాయత్ ఫేజ్-2, వాసవి మెట్రోపాలిస్ గేటెడ్ కమ్యూనిటీ, డీమార్ట్ వెనుక ఉన్న రోడ్లు ఆకతాయిల అరాచకాలకు అడ్డాగా మారాయి. పట్టపగలు బైక్ రేసింగ్‌లు, అర్ధరాత్రి వేళ ప్రాణాంతక స్టంట్లతో ఈ ప్రాంతం ప్రమాదకరంగా మారుతోంది. స్థానికంగా వీధిదీపాలు సరిగా లేకపోవడం ఆకతాయిలకు వరంగా మారింది. ఈ చీకటిని ఆసరాగా చేసుకుని గంజాయి బ్యాచ్‌లు రోడ్లపై తిష్టవేస్తున్నాయి. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లు, చీకటి మలుపులను యువకులు, ప్రేమికులు అసభ్య కార్యక్రమాలకు వేదికగా మారుస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై ఉన్న గుంతలు, పేరుకుపోయిన చెత్తాచదారం సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారడమే కాకుండా, భద్రతాపరమైన ముప్పును కలిగిస్తున్నాయి.

అపార్ట్‌మెంట్ వాసుల ఆందోళన

ఈ అరాచకాలను భరించలేక వాసవి మెట్రోపాలిస్, సమీప అపార్ట్‌మెంట్ వాసులు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌కు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియా రీల్స్ కోసం అర్ధరాత్రి వేళ బైక్ స్టంట్లు చేస్తూ యువత తమ ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా రోడ్డుపై వెళ్లే సాధారణ ప్రయాణికులను కూడా భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.

నగరం అంతటా ఇదే పరిస్థితి..?

హైదరాబాద్‌లో బైక్ స్టంట్లు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. ఇప్పటికే ఐటీ కారిడార్, టీ-హబ్ పరిసరాల్లో పోలీసులు 250కి పైగా కేసులు నమోదు చేశారు. చంచల్ గూడ, హైటెక్ సిటీ, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా ఆకతాయిలను గుర్తించి, వాహనాలను సీజ్ చేస్తున్నారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఇలాంటి సమస్యలపై ప్రక్షాళన జరుగుతున్నప్పటికీ, ఉప్పల్ భగాయత్ లో పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది.

వీడియో చూడండి..

Follow Us