
హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. ప్రతిష్టాత్మక హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ పనులు సాఫీగా సాగేందుకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే విధానాన్ని పోలీసులు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో మొత్తం రూ.1,090 కోట్ల వ్యయంతో రెండు ప్యాకేజీల్లో హెచ్-సిటీ పనులు జరగనున్నాయి. ఆరు ప్రధాన జంక్షన్లలో 7 చోట్ల అండర్‌పాస్‌లు, మరో 7 చోట్ల మల్టీలెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. రాబోయే 24 నెలల పాటు ఈ నిర్మాణ పనులు కొనసాగనున్న నేపథ్యంలో దీర్ఘకాలిక ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ముందస్తుగా ఈ డైవర్షన్ ప్రణాళికను అమలు చేస్తున్నారు.
పంజాగుట్ట నుంచి మాదాపూర్ వైపు: వాహనదారులు ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకుని క్యాన్సర్ ఆసుపత్రి, అగ్రసేన్ చౌరస్తా, జర్నలిస్టు కాలనీ మీదుగా రోడ్ నెం. 45 ద్వారా మాదాపూర్ వెళ్లవచ్చు. లేదా ముందుకు వెళ్లి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇందిరానగర్, వెంకటగిరి నుంచి ఫిల్మ్‌నగర్ వైపు: గతంలోలా చెక్‌పోస్ట్ నుంచి నేరుగా వెళ్లే అవకాశం ఇకపై ఉండదు. చెక్‌పోస్ట్ నుంచి లెఫ్ట్ తీసుకుని ఎన్టీఆర్ భవన్, క్యాన్సర్ ఆసుపత్రి, అగ్రసేన్ చౌరస్తా మీదుగా రౌండ్ తిరిగి ఫిల్మ్‌నగర్ చేరుకోవాలి.
మాదాపూర్ నుంచి పంజాగుట్ట వైపు: మాదాపూర్ నుంచి వచ్చేవారు చెక్‌పోస్ట్ మీదుగా ఎన్టీఆర్ భవన్ ద్వారా నేరుగా పంజాగుట్ట వెళ్లవచ్చు. ఈ మార్గంలో పెద్దగా మార్పులు లేవు.
కేబీఆర్ పార్క్ చుట్టూ ఎదురుగా వచ్చే వాహనాలు ఉండవు కాబట్టి వాహనదారులు రెండు దారుల్లోనూ ప్రయాణించవచ్చు. తమ గమ్యస్థానాలకు తగినట్లుగా లేన్లు మారేందుకు పార్కు చుట్టూ 13 లేన్ చేంజర్లు, 10 ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. రౌండ్ ది క్లాక్ తరహాలోనే ప్రయాణిస్తూ సైన్ బోర్డులను గమనించి లెఫ్ట్ లేదా రైట్ లేన్లలోకి మారే సదుపాయం కల్పించారు.
ట్రాఫిక్ ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా డ్రోన్లు, హైరైజ్ సీసీటీవీ కెమెరాలతో రియల్ టైమ్ పర్యవేక్షణ చేస్తున్నారు. వాహనదారుల సౌలభ్యం కోసం గూగుల్ మ్యాప్స్, నావిగేషన్‌లోనూ కొత్త రూట్లను అప్‌డేట్ చేశారు. పార్కుకు వచ్చే విజిటర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. మొదటి కొన్ని రోజులు ప్రయాణికులకు కాస్త గందరగోళంగా ఉన్నా, ప్రాజెక్టు త్వరగా పూర్తి కావడానికి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. ముఖ్యంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.