9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. సీసీటీవీ చూసి ఆగ్రహించిన స్థానికుల దాడి, అనుమానితుడు మృతి
Hyderabad News: హైదరాబాద్‌లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో 9 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిపై స్థానికులు దాడి చేయగా, చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. బాలిక కుటుంబం చేసిన ఆరోపణలు, సీసీటీవీ ఫుటేజ్, దాడి ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్: కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 9 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక చర్యకు పాల్పడ్డాడనే కోపంతో ఓ వ్యక్తిపై స్థానికులు దాడి చేయగా, చికిత్స పొందుతూ అతడు మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. నాలుగో తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలికతో నిందితుడు అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలికకు ముద్దు పెట్టడం, ఆమెను అసభ్యంగా తాకడం వంటి దృశ్యాలు కాలనీలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ వీడియోలను గమనించిన బాలిక తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
ఆవేశానికి లోనైన కొందరు స్థానికులు, బాలిక కుటుంబ సభ్యులు కలిసి నిందితుడిపై దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన అతడిని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడు హాజిజ్ అబ్దుల్‌గా గుర్తించగా, అతడు నిలోఫర్ ఆస్పత్రి సమీపంలో టీ విక్రయిస్తూ జీవనం సాగించేవాడని స్థానికులు తెలిపారు. బాధిత బాలిక కుటుంబం కూడా అదే ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నివసిస్తోంది. బాలిక తల్లిదండ్రులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై కుల్సుంపుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. బాలికపై లైంగిక దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలతో పాటు, నిందితుడి మరణానికి దారితీసిన దాడి ఘటనపైనా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
