
హైదరాబాద్‌లో కల్తీ ఆహార తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతున్న అధికారులు.. తాజాగా అత్తాపూర్ పరిధిలో మరో అక్రమ నివాసానికి చెక్ పెట్టారు. అత్తాపూర్ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా, అత్యంత అనారోగ్యకరమైన, అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్న ఒక అక్రమ బేకరీ తయారీ యూనిట్‌పై హెచ్-ఫాస్ట్ (H-FAST) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ఆహార భద్రతా ప్రమాణాలను సదరు బేకరీ యాజమాన్యం పూర్తిగా గాలికి వదిలేసినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తూ, ఈగలు, దోమల మధ్యే ప్రజలు తినే బేకరీ పదార్థాలను తయారు చేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ అక్రమ దందాకు కారణమైన బేకరీ నిర్వాహకుడు మొహమ్మద్ అహ్మద్‌ను హెచ్-ఫాస్ట్ అధికారులు ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చట్టపరమైన విచారణ, కఠిన చర్యల నిమిత్తం అతడిని జీహెచ్ఎంసీ సర్కిల్-20 అధికారులకు అప్పగించారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, అనారోగ్యానికి కారణమయ్యే ఇలాంటి అక్రమ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై రాబోయే రోజుల్లోనూ దాడులు మరింత తీవ్రం చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, మరియు విక్రయాల్లో కచ్చితంగా పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని, లేనిపక్షంలో సీజ్ చేయడంతో పాటు కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…