Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రేపు రాష్ట్రం మొత్తం ఉరుములు, మెరుపులతో వర్షాలు

|

Apr 06, 2023 | 3:24 PM

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. అక్కడక్కడా వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. ఈ వాన ధాటికి పలు ప్రాంతాల్లో పంట నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 2 రోజులు ఈ వానలు కంటిన్యూ అవ్వనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రేపు రాష్ట్రం మొత్తం ఉరుములు, మెరుపులతో వర్షాలు
Hyderabad Rain
Follow us on

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్నాహం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా…ఆ తర్వాత ఒక్కసారిగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. హైదరాబాద్‌ సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఎండవేడిమి నుంచి నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగింది. కర్మన్‌ఘాట్‌ దగ్గర హనుమాన్‌ శోభయాత్రను కాసేపు ఆపేశారు. వర్షం తగ్గిన తర్వాత మళ్లీ శోభయాత్ర ప్రారంభించారు.

సికింద్రాబాద్‌, తార్నాక, నాచారం, మలక్‌పేట్‌, కర్మన్‌ఘాట్‌, హిమాయత్‌నగర్‌, నల్లకుంట, నారాయణగూడ, అంబర్‌పేట్‌ , కోఠి, మల్కాజ్‌గిరి ఏరియాలో భారీ వర్షం పడింది. అంబర్‌పేట్‌లో వడగళ్ల వాన కురిసింది. నగరంలోని పలుచోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. కాగా ఈ రోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆల్రెడీ చెప్పింది.

ఇక శుక్రవారం తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఉరుముల, మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది. ఈదురు గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..