వేసవి కాలంలో వర్షాకాలాన్ని తలపిస్తూ.. భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయి. అయితే అకాల వర్షాలు ముగిశాయి. నగరవాసులు ఇక సకాల ఎండలకు సిద్ధమవ్వాలి. ఈరోజు నుంచి ఎండలు భారీగా ఉండబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో వానలు భారీగా కురిశాయి. అకాల వర్షాలు అన్నదాతకు ఎంతో నష్టాన్ని మిగిల్చాయి. ఇటు హైదరాబాద్‌లోనూ వెదర్.. వర్షాకాలాన్ని తలపించింది. కాని.. ఈరోజు నుంచి ఎండాకాలం ఎఫెక్ట్ చూడబోతున్నాం. అసలు సిసలు ఎండలు మండబోతున్నాయి. ఎండలతోపాటు.. వడగాడ్పులు కూడా ఉంటాయని చెబుతోంది వాతావరణ శాఖ.
హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతను మించి హీట్ కండీషన్స్ నమోదయ్యే అవకాశాలున్నయి. దీంతో ఐఎండీ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ. ఎండల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటోంది. ప్రతీ ఏడాది మాదిరిగానే.. మే నెలలో మాడు పగిలే ఎండలు ఉండబోతున్నాయంటోంది. రెండు వారాల కూల్ కూల్ వెదర్ ఇప్పుడు పూర్తిగా మారబోతోంది.
హైదరాబాద్‌తోపాటు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, ములుగు జిల్లాల్లో 40 డిగ్రీలు దాటనుంది. సింగరేణి బెల్ట్‌లో భారీగా మండబోతోంది వాతావరణం. వృద్ధులు, చిన్నారులు ఇంటిపట్టునే ఉండాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు. సూర్యతాపాన్ని తగ్గించే జ్యూసులు, ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలని చెబుతున్నారు. వచ్చే మూడు నాలుగు వారాలు భానుడి ప్రతాపం పీక్స్ లో ఉండబోతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..