Air quality: ప్రమాదకరంగా హైదరాబాద్‌ గాలి.. పీలిస్తే 35 సిగరెట్లు తాగినట్లేనా..? ఇదిగో క్లారిటీ..

హైదరాబాద్‌లో వాయు కాలుష్యం ఆందోళనకరంగా పెరుగుతోంది, కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ 300 వరకు చేరుతోంది. మూడవ పార్టీ యాప్‌ల డేటా, సీపీసీబీ నివేదించిన డేటా మధ్య గణనీయమైన వ్యత్యాసం నిపుణుల ఆందోళనలకు దారితీస్తోంది. కాలుష్య కొలతలలో పీసీబీ పరికరాల ఖచ్చితత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Air quality: ప్రమాదకరంగా హైదరాబాద్‌ గాలి.. పీలిస్తే 35 సిగరెట్లు తాగినట్లేనా..? ఇదిగో క్లారిటీ..
Hyderabad Air Pollution

Edited By:

Updated on: Jan 04, 2026 | 7:57 AM

వాయు కాలుష్యం విషయంలో మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌, దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. వాయు కాలుష్యం గురించి టాపిక్‌ వస్తే అంతా ఢిల్లీ గురించి మాట్లాడుకుంటారు.. కానీ, అతి త్వరలోనే హైదరాబాద్‌ ఆ ప్లేస్‌కు చేరుకునేలా ఉంది. ఎందుకంటే నగరంలో ఎయిర్‌ క్వాలిటీ రోజు రోజుకు పడిపోతుంది. 2026 కొత్త ఏడాది తొలిరోజున పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 300 వరకు చేరుకున్నట్లు కొన్ని థర్డ్‌ పార్టీ, గూగుల్‌ యాప్‌లు, పరికరాల ద్వారా నమోదవుతున్న సూచీలు వెల్లడించాయి. కానీ సీపీసీబీ ఏర్పాటు చేసిన సూచీలలో కొత్త ఏడాది గరిష్ఠంగా 170 వరకే నమోదుకావడం గమనార్హం.

అయితే సీపీసీబీ సూచించే కొలతల్లో కచ్చితత్వం లేదని కొందరు నిపుణులు ఆరోపిస్తున్నారు. నగరంలోని 14 ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి ఏక్యూఐ పరికరాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా గరిష్ఠ, కనిష్ఠ సూచీలను వెల్లడిస్తోంది. ఏక్యూఐ 100 దాటితే ముప్పు పొంచి ఉన్నట్లే. డిసెంబరులో హైదరాబాద్‌లో గరిష్ఠంగా పీసీబీ లెక్కల ప్రకారం ఏక్యూఐ 132 మాత్రమే. థర్డ్‌ పార్టీ యాప్‌లలో నమోదైన ఏక్యూఐ 270 వరకు ఉంది. అయితే ఇంత వ్యత్యాసం ఉండకూడదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎయిర్‌ క్వాలిటీని యురోపియన్‌ ప్రమాణాల మేరకు కొలిచే యంత్రాల ధర ఒక్కొక్కటి రూ.30 లక్షల వరకు ఉంటుందని, పీసీబీ వాడుతున్న పరికరాలు అంత ఖరీదైనవి కాదని తెలుస్తోంది.

ఎయిర్‌ పొల్యూషన్‌ని బయో, ఫిజికల్, కెమికల్‌ రియాక్టివ్‌లని మూడు కేటగిరిలుగా లెక్కిస్తారు. గాలిలో తేమ, బ్యాక్టీరియా, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యర్థాల వాసనలన్నీ మొదటి కేటగిరిలోకి వస్తాయి. సూక్ష్మ ధూళి కణాలను రెండో కేటగిరిలోకి వస్తాయి. రసాయన ప్రభావం కల్గించే కార్బన్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, సల్ఫర్, మిథనాల్, బెంజిన్‌ తదితరాలను మూడో కేటగిరి అయిన కెమికల్‌ రియాక్టివ్‌లో తీసుకుంటారు. ఇవన్నీ ప్రమాణాలను దాటితే ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్‌ వంటివి వస్తాయి. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 100 దాటితేనే ప్రమాదకరం. ఒకవేళ 300లకు చేరితే.. ఆ గాలి పీల్చిన వారికి పలురకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి గాలిని పీలిస్తే రోజుకు 30-35 సిగరెట్లు కాల్చిన దానితో సమానమని నిపుణులు అంటున్నారు.

పీసీబీ క్లారిటీ..

గాలిలో వివిధ అంశాల ఆధారంగా ఏక్యూఐని లెక్కిస్తామని పీసీబీ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్‌ శరత్ తెలిపారు. జాతీయ స్థాయి గాలినాణ్యత ప్రమాణాల ప్రకారమే పీసీబీ కూడా లెక్కిస్తుందని అన్నారు. థర్డ్‌ పార్టీ యాప్‌లు యూఎస్‌ఈపీఏ ప్రమాణాల ప్రకారం లెక్కిస్తున్నాయని, దానివల్ల వ్యత్యాసం ఉంటుందని తెలిపారు. కనిష్ఠాన్ని పరిగణనలోకి తీసుకోకుండా గరిష్ఠం మాత్రమే యాప్‌లు చూపిస్తున్నాయి. పీసీబీ మాత్రం సగటును తీసుకుంటుందని స్పష్టతనిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి