EC likely to Conduct Huzurabad by poll: తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలోనే బై ఎలక్షణ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో అప్పుడే హుజూరాబాద్ ఉపఎన్నికల వేడి రాజుకుంది. రెండు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రణరంగంలోకి దిగాయి. టీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీగా నియోజకవర్గంలో మోహరించారు. వరుస సభలు, సమావేశాలతో ఓటర్లను ప్రసన్న చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రచారం చేస్తున్నారు. ఆయన భార్య జమున కూడా ప్రజా క్షేత్రంలో పర్యటిస్తున్నారు.
ఇక, టీఆర్ఎస్ తరఫున మంత్రులు రంగంలోకి దిగారు. అటు ఎమ్మెల్యేలు సైతం అయా మండలాల్లో తిరుగుతున్నారు. ఇంతకాలం పార్టీలో ఈటల బీజేపీ చేరడంతో క్యాడర్ చేజారకుండా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇంతకాలం కనిపించని నేతలకు సైతం ప్రాధాన్యతనిస్తూ పార్టీ వీడకుండా గట్టి హామీలు ఇస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. నిలిచినపోయిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. ప్రభుత్వం కూడా అభివృద్ధి పేరుతో నిధులను కుమ్మరిస్తోంది.
అంతా ఓకే.. మరి ఉపఎన్నికలు ఎప్పుడు ఉంటాయనని చర్చ జరుగుతున్న వేళ.. ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. సెప్టెంబర్‌లోనే హుజురాబాద్ ఉపఎన్నిక వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నుంచి పార్టీలకు సంకేతాలు అందినట్లు సమాచారం. అందుకే తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ లోగా 80శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ వేగం పెంచాలని అధికారులు భావిస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో అక్కడి ఓటర్లతో పాటు నేతలకు విస్తృతంగా వ్యాక్సిన్ వేయడంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి కూడా ముందే టీకాలు వేయనున్నట్లు సమాచారం. అందుకోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటు అన్ని పార్టీలు అప్పుడే ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మంత్రి పదవిని తొలగించిన ఈటల రాజేందర్.. హుజూర్‌నగర్‌లో మరోసారి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన జూన్ 14న ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్, కరీంనగర్ మాజీ జెడ్పీటీసీ తులా ఉమ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత హుజురాబాద్‌లో పర్యటిస్తున్నారు ఈటల రాజేందర్. నియోజకవర్గ పరిధిలోని తన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ ఆపరేరని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ పంచే డబ్బులకు ప్రజలు లొంగరని.. హుజురాబాద్ ప్రజలు ఆత్మాభిమానం గల వారని అంటున్నారు.
మరోవైపు హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ పోటీచేయబోరనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈటలకు బదులుగా ఆయన భార్య జమున బరిలో నిలుస్తారని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అందుకే ఆమె ఇంటింటి ప్రచారంలో బిజీగా ఉన్నారని పార్టీనేతలు అంటున్నారు. ఇక, ఈటలను నేరుగా రాజ్యసభకు పంపించి.. కేంద్రమంత్రి పదవి ఇస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి.
అటు, ఈటల నుంచి ఓడించి.. గట్టి దెబ్బ కొట్టాలని గులాబీ దళం భావిస్తోంది. అందుకోసం బలమైన నేతను రంగంలోకి దించాలని టీఆర్ఎస్ తమ వ్యూహాలకు పదును పెడుతోంది. మొన్నటి వరకు కౌశిక్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది. ఇటీవల ఆయన మంత్రి కేటీఆర్‌ను కలవడంతో కౌశిక్ రెడ్డే టీఆర్ఎస్ అభ్యర్థి అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరును టీఆర్ఎస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు సతీమణి సరోజనమ్మ పోటీచేయవచ్చన్న అభిప్రాయలూ వ్యక్తమవుతున్నాయి.
ఇక, కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం కౌశిక్ రెడ్డిపైనే ఆశలు పెట్టుకుంది. అయితే అనుహ్యంగా ఆయన మంత్రి కేటీఆర్‌తో భేటీ కావడంతో మరో నేతను వెతుక్కునే పనిలో పడినట్లు తెలుస్తోంది. చివరాఖరుకు ఎవరెవరు రేసులో ఉన్నారన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీల మధ్యనే రసవత్తర పోరు సాగనుంది.