AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరేయ్.. ఏంట్రా ఇది.. హుండీ లెక్కింపు ఉద్యోగాలు.. అంటూ ఉన్నది మొత్తం ఊడ్చేశాడు.. చివరకు

నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలను ఎరగా వేస్తూ ఆర్థికంగా నిలువునా ముంచుతున్నారు. సేవా కార్యక్రమాన్ని ఉద్యోగంగా నమ్మించిన కేటుగాళ్ళు.. నిరుద్యోగులకు కొట్లాది రూపాయల కుచ్చుటోపి పెట్టారు. నిరుద్యోగులను ఈ కేటుగాళ్లు ఎలా మోసం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

అరేయ్.. ఏంట్రా ఇది.. హుండీ లెక్కింపు ఉద్యోగాలు.. అంటూ ఉన్నది మొత్తం ఊడ్చేశాడు.. చివరకు
Fake Hundi Jobs Scam
M Revan Reddy
| Edited By: |

Updated on: May 03, 2026 | 12:27 PM

Share

సేవా కార్యక్రమాన్ని ఉద్యోగంగా నమ్మించిన కేటుగాళ్ళు.. నిరుద్యోగుల నుంచి లక్షలకు లక్షలు కొల్లగొట్టారు. మైక్రో ఫైనాన్స్ మించిన ఈ భారీ మోసానికి సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన పులి రవి.. పలు ఉద్యోగాలు చేసిన ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. జల్సాలకు అలవాటు పడిన రవి.. ఈజీ మనీ కోసం నిరుద్యోగులే టార్గెట్ గా ఓ స్కెచ్ వేశాడు. ఎండోమెంట్ శాఖలో హుండీ లెక్కింపు ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి తెర లేపాడు. కరీంనగర్ కేంద్రంగా రవి సేవా సమితిని ఏర్పాటు చేశాడు. ఈ సమితిలోని సభ్యులతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులోని ఆలయాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో ఎండోమెంట్ అధికారులతో మంచి సంబంధాలను ఏర్పాటు చేస్తున్నాడు. వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకొని దేవాదాయ శాఖలో హుండీ లెక్కింపు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. నెలకు ఆరు డ్యూటీలు ఉంటాయని, రవాణా ఖర్చులతో కలిపి రూ.27,500 వేతనం అందుతుందని, 13 ఏళ్ల పాటు ఈ ఉద్యోగం చేయాల్సి ఉంటుందని నమ్మబలికారు. సంస్థ పేరుతో నిరుద్యోగులకు బాండ్ పత్రాలు కూడా రాసి ఇచ్చారు. నిరుద్యోగులకు నమ్మకం కలిగించడానికి ‘శాలరీ బాక్స్’ అనే యాప్ లో వారి అటెండెన్స్, జీతాల వివరాలు చూపిస్తూ ఇది అసలైన ఉద్యోగమేనని నమ్మించారు.

ఈ నిరుద్యోగులతో గత ఆరు నెలల్లో విజయవాడ, పెనుగంచిప్రోలు, తుని, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, భీమవరం, కాణిపాకం, జపాలి (తిరుపతి), కదిరి తదితర ఆలయాల్లో హుండీ లెక్కింపు పనులను సంస్థ చేయించింది. మొదట్లో ఒకటి రెండు నెలలు వేతనాలు ఇచ్చిన ఆ సంస్థ మూడు నాలుగు నెలల నుంచి పని చేయించుకుని వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో తాము నాలుగు నెలలుగా పనిచేస్తున్నా వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని హుండీ లెక్కింపు చేసిన ఆలయాల అధికారులను ప్రశ్నించారు.

Nakirekal

Fake Hundi Jobs Scam

హుండీ లెక్కింపు పని పూర్తిగా సేవా కార్యక్రమమని, దేవాలయాల నుంచి ఎలాంటి వేతనాలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. నెలలు గడుస్తున్నా అసలు జీతం చేతికి అందకపోవడం.. ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం.. ఏజెంట్లు ముఖం చాటేయడంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించారు. దీంతో నల్లగొండ జిల్లాలో ఉన్న బాధితులు నకిరేకల్ పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టారు.

సేవా కార్యక్రమాన్ని ఉద్యోగంగా నమ్మించిన సదరు సేవా సమితి రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్నాటకల్లో కూడా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ముఠా నిరుద్యోగుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నకిరేకల్ పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us