
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో హార్వెస్టర్ సాయంతో పొలం కోస్తుండగా ఒక కొండచిలువ ప్రత్యక్షమైంది. కొండచిలువ చూడగానే అక్కడ పొలం కోసే వారు ఒక్కసారిగా భయపడ్డారు. వామ్మో కొండచిలువ అంటూ దూరంగా పరుగెత్తారు. ఆ వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పొలాల్లో ఉన్న భారీ కొండ చిలువను తీవ్రంగా శ్రమించి పట్టుకున్నారు. తర్వాత అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లి దాన్ని వదిలేశారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఈ ప్రాంతంలో కొండచిలువలు, పాములు కనిపించడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ ఇక్కడ ఇలాంటి ఘటనలు జరిగాయి. అడవుల్లో ఉండాల్సిన విష సర్పాలు తరచూ జనావాసాల్లో సంచరిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే వారికి అధికారులు ధైర్యం చెబుతూ.. ఇటీవల భారీ వర్షాలు కురియడంతో పెద్ద పెద్ద సర్పాలు బయటకి వస్తున్నాయని అన్నారు.
ఇంటి పరిసర ప్రాంతాలలో పొదలు, చెట్లు ఉండకుండా చూసుకోవాలని స్థానికులకు సూచించారు. నిర్మానుష ప్రదేశాల వద్దకు జాగ్రత్తగా వెళ్లాలని, రైతులు సైతం పొలాలకు వెళ్లే సమయంలో మరింత జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు. చేతిలో కర్ర పట్టుకొని పొలం దగ్గరికి వెళ్లాలని సూచిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.