
కొండేంగ.. ఆ ఊరిలో అది కేవలం ఒక మూగజీవి కాదు.. అందరితో కలిసిపోయిన ఒక కుటుంబ సభ్యుడు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా.. గ్రామస్తులు పెట్టిన ఆహారాన్ని తింటూ అందరితో సన్నిహితంగా మెలిగింది. కానీ విధి ఆడిన వింత నాటకంలో కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలుకోల్పోయింది. దీంతో ఆ గ్రామస్తులు అందరు కన్నీరుమున్నీరయ్యారు. తమ ఇంట్లో మనిషి చనిపోతే ఎలా అంత్యక్రియలు చేస్తారో..అలాగే ఆ కొండేంగకు ఘనంగా అంత్య క్రియలు నిర్వహించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామంలో గత కొంతకాలంగా ఒక కొండేంగ సంచరిస్తోంది. సాధారణంగా కోతులు, కొండేంగలు అంటే పంటలను, ఇళ్లను నాశనం చేస్తాయని ప్రజలు భయపడతారు. కానీ ఈ కొండేంగ మాత్రం చాలా విలక్షణమైనది. గ్రామస్తులు ఎవరైనా ప్రేమతో ఆహారం పెడితేనే తినేది. ఎవరి నుంచీ బలవంతంగా ఏమి లాక్కునేది కాదు. ఊరి ప్రజలతో మమేకమై,అందరితో ఎంతో సన్నిహితంగా మెలిగేది.. గ్రామస్తులు కూడా దాన్ని హనుమంతుడి స్వరూపంగా భావించి అమితంగా ప్రేమించారు.
అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. అందరితో ఆడుతూ పాడుతూ తిరిగిన ఆ కొండేంగను మృత్యువు కరెంట్ షాక్ రూపంలో కబళించింది.ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్‌కు గురై చెట్టు పైనుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నిన్నటి వరకు తమ కళ్లముందే తిరిగిన కొండేంగ అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి.. చిన్నగుండవెల్లి గ్రామస్తులు చలించిపోయారు. ఊరంతా విషాద ఛాయలు అలుము కున్నాయి. ఆ మూగజీవి పై ఉన్న మమకారంతో చిన్నగుండవెల్లి ప్రజలు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు.
కేవలం జంతువు కదా అని పారేయకుండా.. మనిషి చనిపోతే ఎలాంటి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తారో అలాగే నిర్వహించాలని సంకల్పించారు. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, హనుమాన్ యూత్ సభ్యులు, వార్డు మెంబర్లతో పాటు గ్రామ ప్రజలంతా ఏకమయ్యారు. కొండేంగ పార్థివ దేహానికి పూలమాలలు వేసి అలంకరించారు. బ్యాండ్ మేళాలు, డప్పు చప్పుళ్లతో గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.
బాజాభజంత్రీల నడుమ ఊరేగిస్తూ కొండేంగను స్థానిక స్మశానవాటికకు తరలించారు. అక్కడ హిందూ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి ఘనంగా ఖననం చేశారు. మూగజీవాల పట్ల మనుషులు క్రూరంగా ప్రవర్తిస్తున్న ఈ రోజుల్లో.. ఒక కొండేంగ మృతికి కన్నీరు కార్చి, దానికి మనిషి లాగే అంత్యక్రియలు నిర్వహించిన చిన్నగుండవెల్లి గ్రామస్తుల మానవత్వాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.