
వేసవి కాలం ప్రారంభమైంది. అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రేషన్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు లబ్దిదారులకు ఒకేసారి 3 నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ అధికారులు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్ర ఆదేశాలతో ఒకే సారి 3 నెలల సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే ప్రస్తతం దేశంలోని ఏ రాష్ట్రంలోని లేని విధంగా కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఒక్కో రేషన్ కార్డు లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులను కూడా అందజేసింది. దీంతో రాష్ట్రంలో రేషన్ కార్డు దారుల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోటికిపైగా రేషన్ కార్డు దారులు ఉన్నారు. అయితే వీరందరికి ఒకే సారి మూడు నెలల రేషన్ ఇవ్వాలంటే భారీ మొత్తంలో దాన్యం నిల్వలు కావాల్సి ఉంటుంది. కాబట్టి రేషన్ పంపిణీకి సరిపడా బియ్యం కోటా నిలువలు, సాధ్యాసాధ్యాలను సర్కార్ పరిశీలిస్తోంది.
అయితే ప్రభుత్వం ఒకే సారి 3 నెలల రేషన్ బియ్యాన్ని అందించడం ఇది మొదటి సారి ఏం కాదు. గతంలోనూ ఇలానే ఒక సారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని తెలంగాణ సర్కార్ లబ్ధిదారులకు అందించింది. అయితే అప్పుడు లబ్ధి దారులతో పాటు, రేషన్ డీలర్లు సైతం కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. ఒకే సారి ఎక్కువ మొత్తంలో స్టాక్ రావడంతో నిల్వ చేసేందుకు స్థలం లేక డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి తోడు సర్వర్ సమస్యలు కూడా డీలర్లు ఎదుర్కొన్నారు. కాబ్టటి మరోసారి ఇదే తరహాలో రేషన్ అందించాలని కేంద్రం నుంచి దేశాలు రావడంతో గతంలో ఎదురైన సమస్యలను అదిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.