
హైదరాబాద్‌లోని వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మూసారాంబాగ్-అంబర్‌పేట మధ్య మూసీ నదిపై ఉన్న పాత వంతెన శిథిలావస్థకు చేరుకోవడం, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఆ వరద నీరు ఈ వంతెనపై నుంచి వెళ్లి వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో ఆ ప్రాంతంలో పాత వంతెన కంటే ఎత్తులో మరో వంతెన నిర్మించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయానికి వచ్చారు.
ఇందులో భాగంగానే మూసారాంబాగ్-అంబర్‌పేట రూట్‌లో మూసీ నదిపై రూ.52 కోట్లతో 220 మీటర్ల మేర వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ ఫ్లైఓవర్‌కు సంబంధించి ఇప్పటికే నిర్మాణ పనులు మొత్తం పూర్తయ్యాయి. చివరకు కొన్ని చిన్న చిన్న రిపేర్‌లు ఉన్నాయి. అవి పూర్తయితే ఈ నెలాఖరులోపు ఈ వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఈ వంతెన అనుకున్న టైంలోపు అందుబాటులోకి వస్తే ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది.
అయితే మూసారాంబాగ్, అంబర్‌పేట ప్రాంతాల్లో నివసించే ప్రజలు హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ వంతెన కీలకమైనది కావడంతో దీని నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేశారు అధికారులు. ఇదొక్కటే కాదు నగరంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడినా వెంటనే దానికి శాశ్వత పరిష్కారాన్ని తీసుకొస్తూ వాహనదారులకు, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.