
ఒకప్పుడు గ్రామాల్లో అపరిచితులు అడుగుపెడితే గ్రామ సింహాలైన కుక్కల అరుపులు వినిపించేవి. కానీ, ఇప్పుడు భద్రాచలం ఏజెన్సీలోని మిర్చి తోటల్లో అడుగుపెడితే చాలు.. అరుపులకు బదులు కుయ్ కుయ్ మంటూ హై-టెక్ సైరన్లు మోగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం, చర్ల మండలాల రైతులు తమ పంటను కాపాడుకోవడానికి ఎంచుకున్న ఈ మార్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని లంక భూముల్లో పండే మిర్చికి దేశీయంగానే కాకుండా ఎగువ మార్కెట్లలోనూ విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడి నేల స్వభావం వల్ల మిర్చి అత్యంత నాణ్యంగా, ఘాటుగా ఉంటుంది. క్వింటా మిర్చి ధర వేలల్లో పలుకుతుండటంతో, దీనిని ఎర్ర బంగారంగా పిలుస్తారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి, ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కోత కోసి కల్లాల్లో ఆరబోసినప్పుడు దొంగల భయం రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
దొంగల బెడదను శాశ్వతంగా వదిలించుకోవడానికి రైతులు సాంకేతికతను ఆయుధంగా చేసుకున్నారు. గోదావరి ఇసుక తిన్నెల్లో ఎక్కడ చూసినా ఎత్తైన టవర్లపై సిసి కెమెరాలు దర్శనమిస్తున్నాయి. పొలాల్లో విద్యుత్ సౌకర్యం లేకపోయినా ఇబ్బంది లేకుండా ఇవి సోలార్ శక్తితో పనిచేస్తాయి. ఈ కెమెరాలు అన్ని దిశలా తిరుగుతూ హై-రిజల్యూషన్ చిత్రాలను సెల్ ఫోన్లకు పంపిస్తాయి. కల్లాల్లోకి ఎవరైనా అపరిచితులు ప్రవేశించగానే సెన్సార్ల ద్వారా గుర్తించి పెద్ద పెట్టున సైరన్ మోగిస్తాయి.
రైతులు ఇంట్లో కూర్చునే తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా తోటలో ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఈ టెక్నాలజీ కేవలం దొంగల నుండే కాకుండా, కూలీల పనితీరును పర్యవేక్షించడానికి కూడా రైతులకు ఎంతో ఉపయోగపడుతోంది. గతంలో రాత్రంతా పొలాల్లో కాపలా కాయాల్సి వచ్చేది, ఇప్పుడు ఫోన్లోనే అంతా కనిపిస్తోంది. పనివాళ్లకు సూచనలు ఇవ్వడం కూడా సులభమైంది అని స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంట రక్షణలో రైతులు ప్రదర్శిస్తున్న ఈ హై-టెక్ తెలివితేటలు ఇప్పుడు ఇతర ప్రాంతాల రైతులకూ ఆదర్శంగా నిలుస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..