లోక్‌సభ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను తప్పుడు హామీలుగా అభివర్ణించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. గతంలో ఇచ్చిన హామీలనే ప్రధాని మోదీ నెరవేర్చలేకపోయారని ఆరోపించింది. బీజేపీ మేనిఫెస్టో పేరు గొప్ప.. ఊరు దిబ్బలా ఉందన్నారు. సుస్థిరత, సమర్థత, భద్రత, సంకల్ప్ లాంటి గంభీరమైన మాటలు జోడించి పేజీలు నింపారని విమర్శించారు.
2024 పార్లమెంటు ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోలో వాస్తవాలు మరుగున పడేసి, ఆర్భాటపు ప్రకటనలే పరిమితం అయిందన్నారు హరీష్ రావు. మాటల్లో వికసిత్ భారత్ – చేతల్లో విభజిత్ భారత్ అని మరోసారి బీజేపీ నిరూపించిందన్నారు. మాటల గారడీ తప్ప, చేతల్లో చేసేదేమీ లేదని తేల్చి చెప్పిందన్నారు. బీజేపీ మేనిఫెస్టో ప్రజల డిమాండ్ల నుంచి వచ్చింది కాదని, చెప్పడానికి పది ఉదాహరణలు చెపుతాను. మహిళలు, యువకులు, పేదలు, రైతులే తమకు ప్రధానమని చెప్పినా, ఈ నాలుగు వర్గాలను కూడా బీజేపీ విస్మరించిందని హరీష్ రావు మండిపడ్డారు. ఇందుకు సంబంధించి ఉదాహరణలను హరీష్ రావు వివరించారు.
1. రైతు రుణమాఫీ ముచ్చటే మానిఫెస్టోలో లేదు
దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి రైతుల రుణమాఫీ భారాన్ని కేంద్రం కూడా భరించాలని డిమాండ్లు వచ్చాయి. కానీ బీజేపీ మేనిఫెస్టోలో రైతుల రుణమాఫీకి సంబంధించి ఒక్క మాట కూడా హామీగా ఇవ్వలేదు. కార్పొరేట్ కంపెనీల రుణాలను 12 లక్షల కోట్ల వరకు మాఫీ చేసిన మోదీ సర్కార్, పదేళ్లలో ఒక్క రైతుకు చెందిన ఒక్క రూపాయి కూడా రుణం మాఫీ చేయలేదు. రాబోయే కాలంలో రుణమాఫీ చేసేది లేదని మేనిఫెస్టోలోనే చెప్పినట్లయిందన్నారు హరీష్.
2. జాతీయ ప్రాజెక్టు ఊసులేదు
ప్రతీ రాష్ట్రానికి కనీసం ఒక్కటైనా భారీ నీటి పారుదల ప్రాజెక్టును కేంద్ర నిధులతో నిర్మించాలని అనేక రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. కానీ బీజేపీ మేనిఫెస్టోలో ఇందుకు సంబంధించిన ఎలాంటి హామీ లేదు.
3.మధ్య తరగతికి ఆదాయపన్ను రాయితీలు లేవు
అల్పాదాయం కలిగిన మధ్య తరగతి జీవులకు ఆదాయ పన్నులో రాయితీలు కల్పించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఏడాదికి రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు, రూ. పది లక్షల వరకు 5 శాతం పన్ను కోసం డిమాండ్లున్నాయి. కానీ బీజేపీ మేనిఫెస్టోలో ఆ విషయమే లేదు.
4. కార్మికులు, చేతివృత్తుల వారికి పన్ను మినహాయింపు లేదు
తెలంగాణలో సింగరేణి మాదిరిగా దేశ వ్యాప్తంగా గనుల్లో, ఖార్ఖానాల్లో, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు ఆదాయ పన్ను మినహాయించాలని ఎన్నో కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి. కానీ ఆ విషయమే బీజేపీ పట్టించుకోలేదు. చేతి వృత్తుల ద్వారా వస్తువులు తయారు చేసి అమ్మే వారికి కూడా పన్ను మినహాయింపు ఇచ్చే విషయంపై బీజేపీ హామీ ఇవ్వలేదు.
5. యువతకు ఉద్యోగాల ముచ్చటే లేదు
భారతీయ జనతా పార్టీ గత మేనిఫెస్టోలో ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. పదేళ్లలో ఆ హామీ అమలు కాలేదు. ఈ సారి అసలు ఉద్యోగాల ముచ్చటే మేనిఫెస్టోలో పెట్టలేదు.
6. చట్టసభల్లో బిసి రిజర్వేషన్ పెంపు విషయం ప్రస్తావించలేదు
బిసి, ఎస్సీ, ఎస్టీలకు ఎంతో మేలు చేస్తామని గొప్పగా చెప్పుకోవడం తప్పా, చేతల్లో చేసిందేమీ లేదు. ఎన్నికల సంస్కరణలు తెచ్చి జమిలి ఎన్నికలు పెడతామని చెప్పారు తప్పా, బిసిల రిజర్వేషన్ గురించి ప్రస్తావన లేదు. చట్టసభల్లో బిసిలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. చాలా రాష్ట్రాలు కూడా కోరాయి. కానీ బీజేపీ మేనిఫెస్టోలో ఆ విషయమే లేదు.
7. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ గురించి హామీ లేదు
ఎన్నికల సమయంలో ఓట్లు దండుకోవడానికి తప్ప నిజంగా ఎస్సీ, ఎస్టీలకు బిజెపి చేసిందేమీ లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎం.ఆర్.పి.ఎస్., ఎల్.హెచ్.పి.ఎస్. ఉద్యమాలు నడిచినట్లే దేశ వ్యాప్తంగా కూడా ఎస్సీ, ఎస్టీలు వర్గీకరణ కోరుకుంటున్నారు. బిసిల మాదిరిగానే వర్గీకరణ డిమాండ్ చేస్తున్నారు. ఆయా వర్గాలను మభ్య పెట్టడమే తప్ప, బిజెపి మానిఫెస్టోలో ఈ డిమాండ్ పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
8. 50 శాతం రిజర్వేషన్ పరిమితి పెంచడంపై మాట లేదు
ఎస్సీ, ఎస్టీ, బిసిలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ దేశంలో రిజర్వేషన్ 50 శాతం దాటవద్దనే నిబంధన అమలవుతోంది. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచుకునే వెసులుబాటు కోసం పార్లమెంటులో చట్టం తేవాలని డిమాండ్ ఉంది. కానీ బీజేపీ మేనిఫెస్టోలో ఆ విషయమే లేదు.
9. హైదరాబాద్ సహా మెట్రో నగరాల అభివృద్ధిపై స్పందన లేదు
భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తూ, దేశానికి అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న ఆరు ప్రధాన నగరాల అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడి ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ తోపాటు, ఢిల్లీ, కలకత్తా, ముంబై, చెన్నై, బెంగులూరు నగరాలు భారతదేశానికి చెందిన ప్రధాన నగరాలు. వీటి అభివృద్ధి దేశ అభివృద్ధితో ముడిపడి ఉంది. ఈ నగరాల్లోనే దాదాపు పదికోట్ల మంది నివనిస్తున్నారు. అయినా సరే ఈ మెట్రో నగరాల అభివృద్ది గురించి బిజెపి మానిఫెస్టోలో ఎలాంటి హామీ లేదు.
10. ఉచిత పథకాలపై బీజేపీ చెప్పిందేమిటి? చేసిందేమిటి?
పదేళ్లలో చేసిందేమీ లేకపోవడంతో ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే ఉచిత పథకాలు అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. ఉచిత రేషన్, ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం, ఉచిత ఇండ్లు పేరుతో ఉచిత పథకాల జపం చేశారు. వివిధ రాష్ట్రాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, వాటిని తప్పుపట్టిన మోడీ తన మానిఫెస్టోలో మాత్రం మొత్తం ఉచిత పథకాల హామీనే ఇచ్చారు. మోదీ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో అమలు చేసిన పథకాలన్నీ అందరికీ కాకుండా కొందరికే పరిమితం చేశారు. అది రేషన్ బియ్యం అయినా, రైతులకు ఆర్థిక సహాయమయినా, ఉచిత వైద్యమయినా, ఇచిత ఇండ్లయినా అదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సుస్థిరత, సమర్థత, భద్రత, సంకల్ప్ లాంటి గంభీరమైన మాటలు జోడించి పేజీలు నింపారు తప్పా, నిజంగా భారతీయ సమాజం ఇవ్వాళ ఏమి కోరుకుంటున్నదో గుర్తించి, దానిపై పార్టీ విధానం ప్రకటించలేదు. ప్రజలంతా ఈ మానిఫెస్టోను తిరస్కరించారని, బీజేపీకి ఓటు వేయవద్దని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..