గత కొంతకాలంగా ప్రజలకు దూరంగా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అనారోగ్య కారణాలతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఎన్నికల ప్రచార చివరి సభ తర్వాత ప్రజల్లోకిరాని కెసిఆర్ వచ్చేనెల నుంచి బయటకు రానున్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ 29న చివరి ఎన్నికల ప్రచారంలో చివరి బహిరంగ సభ బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం కేసీఆర్. ఎన్నికల్లో ఫలితాలు బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రావడంతో ఇక ఆయన మీడియా ముందుకు కూడా రాలేదు.
ఆయన వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన కొంతమంది స్థానిక ప్రజల్ని మాత్రమే కలిశారు. ఆ తర్వాత కొద్ది రోజులకి అదే ఫామ్ హౌస్‌లో ప్రమాదవశాత్తు కింద పడటంతో యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తుంటి ఏముక విరగడంతో సర్జరీ చేయించుకున్న కేసీఆర్ గత నెల రోజులుగా నంది నగర్‌లో ఉన్న పాత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొంతమంది ముఖ్య నేతలను మాత్రమే కలుస్తున్నారు గులాబీ బాస్.
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ భవన్‌లో ప్రతిరోజు పార్లమెంటు నియోజకవర్గం వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ పూర్తిస్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉన్నా.. కేసీఆర్ యాక్టివ్‌గా లేని లోటు మాత్రం కనిపిస్తోంది. అసలే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ప్రభావంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రెండు జాతీయ పార్టీలను ఎదురొడ్డి పోరాడి మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకుంటామని నేతలు చెప్తున్నారు. అయితే కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి వస్తేనే అది సాధ్యమని కార్యకర్తలు అంటున్నారు. ఇప్పుడిప్పుడే నడక ప్రాక్టీస్ చేస్తున్న కేసీఆర్ మరో రెండు వారాల్లో ఎలాంటి సహాయం లేకుండా నడిచే అవకాశం ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు.
వచ్చేనెల 10వ తేదీన తెలంగాణ భవన్‌కు కేసీఆర్ వస్తారని, కార్యకర్తలను కలుస్తారని తెలుస్తోంది. ఫిబ్రవరి 17వ తేదీన కేసీఆర్ పుట్టిన రోజు కూడా ఉంది. ఆరోజు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండి అందరిని కలుస్తారని అంటున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు ఫిబ్రవరి చివరి వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అప్పటిలోగా కేసీఆర్ పూర్తిస్థాయిలో పార్టీ వ్యవహారాలు చూడకపోతే కార్యకర్తల్లో ఉత్సాహం సన్నగిల్లే అవకాశం ఉంది. ఇందుకోసమే ఫిబ్రవరి 10 తర్వాత గులాబీ బాస్ ప్రజల్లోకి వస్తారనేది పార్టీ నేతలు చెబుతున్న మాట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..