
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నకిరిపేటలో విషాదం చోటుచేసుకుంది. వేటగాళ్లు అటవీ జంతువల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఓ ఫారెస్ట్ ఆఫీస్ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. పాల్వంచ రేంజ్ పరిధిలో ఉన్న చెరువు సింగారం బీట్ లో వన్యప్రాణులను వేటాడుతున్నారనే సమాచారంతో అటవీశాఖ సిబ్బంది మంగళవారం రాత్రి 10 గంటలకు ఫీల్డ్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే వన్యప్రాణుల కోసం అమర్చిన కరెంట్ తీగలు తగిలి బీట్ ఆఫీసర్ నవీన్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.
అది గమనించిన తనతో పాటు ఉన్న సిబ్బంది అతన్ను వెంటనే 108 ద్వారా భద్రాచలం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ నవీన్‌ను పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. అయితే నవీన్ రెండు నెలల క్రితమే బదిలీపై చెరువు సింగారం వచ్చారని.. ఇటీవలే ఆయన బీట్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టాడని తోటి సిబ్బంది తెలిపారు.
గత కొంతకాలంగా బూర్గంపాడు మండల పరిధిలోని పలుచోట్ల వేటగాళ్లు కరెంటు తీగలు అమర్చి వన్యప్రాణులను వేటాడడం పరిపాటిగా మారిందని, వన్యప్రాణుల వేటను కట్టడి చేసేందుకు వెళ్లిన తమ తోటి ఉద్యోగి విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోవడంతో తోటి సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బూర్గంపాడు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.