TRS vs BJP: రక్తి కడుతున్న తెలంగాణ రాజకీయం.. ఎన్నికలకు ముందు పసందుగా వ్యూహ ప్రతివ్యూహాలు

| Edited By: Anil kumar poka

Jan 05, 2022 | 4:33 PM

గత రెండు నెలలుగా తెలంగాణ (Telangana)లో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party), తెలంగాణ రాష్ట్ర సమితి

TRS vs BJP: రక్తి కడుతున్న తెలంగాణ రాజకీయం.. ఎన్నికలకు ముందు పసందుగా వ్యూహ ప్రతివ్యూహాలు
TRS vs BJP
Follow us on

TRS BJP fight continues in Telangana: గత రెండు నెలలుగా తెలంగాణ (Telangana)లో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party), తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi) ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయ వైరం చెలరేగుతోంది. వరి ధాన్యం సేకరణపై కేంద్రాన్ని నిందిస్తూ టీఆర్ఎస్ (TRS), రాష్ట్రాన్ని తప్పుపడుతూ బీజేపీ (BJP) నేతలు గత రెండు నెలలుగా ప్రకటనలు చేస్తూనే వున్నారు. తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం సేకరించడం లేదంటూ మోదీ ప్రభుత్వంపైనా, బీజేపీ నేతలపైనా యుద్దాన్ని ప్రకటించిన గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (Chief Minister K Chandra Shekhar Rao) స్వయంగా ఢిల్లీ (Delhi) వెళ్ళారు. కొన్ని రోజులు అక్కడే మకాం వేసి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు ప్రయత్నించారు. నాలుగైదు రోజులు ఢిల్లీలోనే వున్న తరువాత కారణమేదైతేనేం కేసీఆర్ ప్రధానిని కలవకుండానే వెనుదిరిగారు. ఆ తర్వాత కూడా బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగింది. నిజం చెప్పాలంటే మాటల మంటలు చెలరేగాయి అని చెప్పాలి. తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రం సేకరించడం లేదంటూ యాసంగిలో వరి పంట వేయొద్దని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తెలంగాణ రైతాంగానికి విఙ్ఞప్తి చేశారు. దీన్ని బీజేపీ నేతలు తప్పు పట్టారు. వరి పంటను వేయాలని రైతులకు పిలుపునిచ్చారు. దీంతో కమల నాథులకు, గులాబీ దళానికి మధ్య పోరాటం మరింత ముదిరింది.

ఈ క్రమంలోనే బీజేపీ నేతలు మార్కెట్ యార్డులను, కల్లాలను సందర్శించడం మొదలుపెట్టారు. రైతులను పరామర్శించేందుకు, కేంద్రం ఏ మేరకు ధాన్యాన్ని సేకరించిందో రైతులకు తెలిపేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే.. బీజేపీ నేతల పర్యటనలకు అనుమతులు లభించకపోవడం, దాంతో ఉద్రిక్తతలు చెలరేగడం నవంబర్ నెలాఖరు నుంచి డిసెంబర్ రెండో వారం దాకా చూశాం. ఆ తర్వాత ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రకటన తెలంగాణ రాష్ట్ర సమితి నేతలకు ఒకింత అప్ సెట్‌కు గురి చేశాయి. అదే క్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు లోపలా, బయటా ఆందోళనకు దిగారు. నాలుగైదు రోజుల పాటు ఆందోళన కొనసాగించిన తర్వాత గులాబీ ఎంపీలు పార్లమెంటు సెషన్‌ను బాయ్‌కాట్ చేసి వచ్చేశారు. ఆతర్వాత తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్ళి ధాన్యం సేకరణపై కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రయత్నించారు. వీరికి ఒకట్రెండు సార్లు పీయుష్ గోయెల్ ని కలిసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. అయితే.. తెలంగాణ నుంచి జరుపుతున్న ధాన్యం సేకరణకు పెంచుతామని కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో ధాన్యం రాజకీయం సద్దుమణిగింది.

ఈలోగా తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల వ్యవహరం తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరగిన నేపథ్యంలో దానికి అనుగుణంగా జోన్ల వ్యవస్థలో ప్రభుత్వం మార్పులు చేసిన విషయం విధితమే. ఇపుడీ జోన్ల వారీగా ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన జీవో నెంబర్ 317 కారణంగా పలు జిల్లాల్లో బదిలీల వ్యవహారం గందర గోళంగా మారింది. సీనియారిటీ ప్రాతిపదికన స్థానికత ఎలా నిర్ణయిస్తారంటూ పలు జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఇది కాస్తా రాజకీయాంశంగా మారింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల మద్దతు వచ్చే ఎన్నికల్లో అవసరమని భావించిన విపక్షాలు వారి అంశాన్ని టేకప్ చేశాయి. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్… జనవరి 2వ తేదీన  దీక్షకు పూనుకున్నారు. దానికి అనుమతి లభించకపోవడంతో కరీంనగర్‌లోని తన సొంతింటిలో దీక్షకు దిగారు. సొంతింటిలో చేస్తున్న సంజయ్‌ దీక్షను విరమింప జేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. జనవరి 2న సంజయ్‌ని అరెస్టు చేశారు. సంజయ్ అరెస్టు తర్వాత పలు నాటకీయ పరిణమాలు చోటుచేసుకున్నాయి.

ఆదివారం అర్ధరాత్రి సంజయ్‌ని మానకొండూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్‌లోనే సంజయ్, మరికొందరు బీజేపీ నేతలు దీక్ష కొనసాగించారు. జనవరి 3న తెల్లవారుజామున సంజయ్‌ని కరీంనగర్ పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు కోర్టులో హాజరుపరిచారు. అయితే.. సంజయ్‌ని అరెస్టు చేసినప్పటి నుంచి బీజేపీ శ్రేణులు ఒక్క కరీంనగర్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు దిగారు. పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈక్రమంలో సంజయ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో ఆయన్ను కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్‌కు ఆదేశించింది. పోలీసు అధికారులపైనా, సిబ్బందిపైనా బండి సంజయ్ సహా బీజేపీ నేతలు దాడి చేశారని, పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసి ప్రభుత్వానికి సుమారు 20 లక్షల రూపాయల నష్టం కలిగించారంటూ పోలీసులు అభియోగాలు మోపారు. ఐపీసీ సెక్షన్లు 143, 188, 332, 333, 341, 51 (సీ) సెక్షన్ల కింద సంజయ్ సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. దాంతో బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం సంజయ్‌ని రిమాండ్ పంపాలని ఆదేశాలిచ్చారు.

ఇక సంజయ్ అరెస్టుతో భగ్గుమన్న భారతీయ జనతా పార్టీ వర్గాలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఇదేసమయంలో హైదరాబాద్ పర్యటనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా రావడంతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్రక్తత ఏర్పడింది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో నడ్డా ఎలాంటి పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొన వద్దంటూ పోలీసులు నడ్డాకు నోటీసు ఇచ్చారు. అయితే.. తనకు స్వేచ్ఛ వుందంటూ పోలీసుల నోటీసులకు బదులిచ్చిన నడ్డా హైదరాబాద్ నగరంలోకి ఎంటరయ్యారు. బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ప్రదర్శనకు హాజరయ్యారు. మరోవైపు బీజేపీ నేతలు తెలంగాణలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారంటూ టీఆర్ఎస్ నేతలు ఎదురు దాడికి దిగారు.

తెలంగాణలో మరో ఏడాదిన్నర తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈక్రమంలో రాష్ట్రంలో అధికార పగ్గాలను చేపట్టేందుకు కమలనాథులు ఉత్సాహం చూపిస్తున్నారు. రెండు దఫాలుగా కొనసాగిని టీఆర్ఎస్ పరిపాలనపై ప్రజల్లో వ్యతిరేకత వుందని భావిస్తున్న బీజేపీ నేతలు.. దాన్నుంచి ప్రయోజనం పొందేందుకు, కాంగ్రెస్  పార్టీని మూడో స్థానంలోకి నెట్టి.. సొంతంగా తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టేందుకు కాషాయదళం వ్యూహరచన చేస్తోంది. అందువల్లే ఏ అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకుని కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలంటూ ప్రజల్లోకి వెళ్ళేందుకు కమలనాథులు కార్యచారణ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది రాజకీయం తెలంగాణలో రక్తికట్టబోతోంది అనడంలో అతిశయోక్తి లేదు.