
కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఆ జిల్లాలో నేతలు ఫ్యామిలీ టికెట్స్ కోసం ప్రయత్నిస్తున్నారా.? జిల్లా కాంగ్రెస్‌లో కుటుంబ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయా.? అసెంబ్లీ టికెట్ల మాదిరిగానే ఎంపీ టికెట్లు కూడా ఆ కుటుంబాలకేనా.? ఆ ఎంపీ సీట్లపై ఆశలు పెట్టుకున్న నేతల భవిష్యత్తు ఏంటి.? నల్లగొండ జిల్లాలోని ఎంపీ స్థానాలపై కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉన్నాయి.? కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. జిల్లాలో12 స్థానాలకు గాను 11 స్థానాలను కైవసం చేసుకొని పూర్వ వైభోవాన్ని చాటుకుంది. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌కు రాజకీయ ఉద్దండులు కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి రేవంత్ మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ముగ్గురు కీలక కాంగ్రెస్ నేతల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత లభించింది. హుజూర్‌నగర్, కోదాడ నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి పోటీ చేసి గెలుపొందగా.. నల్లగొండ, మునుగోడు నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇక నాగార్జున సాగర్‌లో మాజీ మంత్రి జానారెడ్డి తాను బరి నుంచి తప్పుకుని తన చిన్న కుమారుడు జయవీర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలు ఈ మూడు కుటుంబాల చేతుల్లో ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ సిట్టింగ్ స్థానాలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. ఇప్పుడు లోక్‌సభ స్థానాలను సైతం తమ కుటుంబ సభ్యులకు దక్కేలా బడా నేతలు పావులు కదిపారు. ఇప్పటికే నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డిని ప్రకటించింది. ఇక భువనగిరి లోక్‌సభ స్థానంపై కోమటిరెడ్డి కుటుంబం దృష్టి సారించింది. కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు మోహన్ రెడ్డి కుమారుడు సూర్య పవన్ రెడ్డి భువనగిరి ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. భువనగిరి నుంచి తమ కుటుంబంలో ఒకరిని బరిలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంపై కోమటిరెడ్డి బ్రదర్స్‌కి గట్టిపట్టు ఉంది. 2009 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపొందగా, 2014లో ఆయన ఓడిపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా విజయం సాధించారు. భువనగిరి నియోజకవర్గంలో తమ పట్టును కోల్పోకుండా ఉండేందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారట. ఈ ఎంపి స్థానాన్ని తమ చేతి నుంచి చేజార్చుకోవద్దన్న పట్టుదలతో కోమటిరెడ్డి కుటుంబం ఉందట.
ఇప్పటికే ఐదు అసెంబ్లీ స్థానాలు మూడు కుటుంబాల చేతుల్లో ఉండగా, తాజాగా నల్లగొండ ఎంపీ టికెట్ జానారెడ్డి కుటుంబానికి దక్కింది. ఇక భువనగిరి స్థానంపై రేవంత్‌రెడ్డికి సన్నిహితుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్న గుత్తా అమిత్ రెడ్డి, సూర్యాపేట డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్‌లు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత పరిణామాలతో వీరంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. దీంతో లోక్‌సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో ఫ్యామిలీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయని చెబుతున్నారు పార్టీ నేతలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..