Bhadrachalam: భద్రాచలం రాములోరిపై అసభ్యకర పోస్టులు.. ఫేక్ అకౌంట్లతో రెచ్చిపోతున్న పోకిరీలు..

Bhadradri Sita Ramachandraswamy Devasthanam: భద్రాచలం రాములోరిపై సోషల్ మీడియా పోకిరీలు విషం చిమ్మారు. ఫేక్‌ అకౌంట్స్‌ క్రియేట్‌ చేసి, పోర్న్‌ ఫొటోలతో కలకలం సృష్టించారు.

Bhadrachalam: భద్రాచలం రాములోరిపై అసభ్యకర పోస్టులు.. ఫేక్ అకౌంట్లతో రెచ్చిపోతున్న పోకిరీలు..
Bhadradri Sita Ramachandraswamy Devasthanam

Updated on: Jun 09, 2022 | 8:00 AM

సోషల్ మీడియా పోకిరీలు పేట్రేగిపోతున్నారు. తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో చెలరేగిపోతున్నారు. వాళ్లూ వీళ్లని తేడా లేకుండా కేటుగాళ్లు అందరిపైనా విషం చిమ్ముతున్నారు. చివరికి దేవుళ్లు, దేవతలు, గుళ్లను కూడా వదలడం లేదు. తాజాగా భద్రాచలం రాములోరిని టార్గెట్‌ చేశారు. భద్రాద్రి శ్రీరామ దివ్యక్షేత్రం పేరుతో ఫేస్‌బుక్‌లో ఫేక్‌ అకౌంట్ ఓపెన్ చేసిన కేటుగాళ్లు, అశ్లీల చిత్రాలతో పోస్టులు చేస్తున్నారు. భద్రాచలం టెంపుల్‌ సిటీ, భద్రాద్రి శ్రీరామ దివ్యక్షేత్రం పేరుతో ఫేస్‌బుక్‌లో ఫోర్న్‌ ఫొటోలు అప్‌లోడ్‌ చేయడాన్ని గుర్తించిన భక్తులు, భద్రాచలంల ఏఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాంతో, భద్రాద్రి ఆలయ అధికారులు కూడా దీనిపై రియాక్టయ్యారు. భద్రాచలం టెంపుల్ పేరుతో ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవని ఆలయ అధికారులు వెల్లడించారు. భద్రాచలం టెంపుల్‌ పేరుతో ఫేస్‌బుక్‌లో వస్తోన్న పోస్టులకు, ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు.

సోషల్‌ మీడియాలో ఫేక్‌ పోస్టులపై ఆలయ అధికారులు కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు. దాంతో, ఆ పోస్టులు ఎవరి పనో తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆకతాయిల పనిగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ అకౌంట్లను బ్లాక్ చేయించిన అధికారులు, అలాంటి అకౌంట్స్‌ నుంచి ఎలాంటి మెసేజ్‌లు వచ్చినా స్పందించవద్దని, డబ్బులు అడిగినా ఇవ్వొద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం, భద్రాచలం టెంపుల్‌ సిటీ, భద్రాద్రి శ్రీరామ దివ్యక్షేత్రం పేరుతో క్రియేటైన ఫేక్‌ అకౌంట్స్‌పై దర్యాప్తు జరుగుతోంది. ఇది ఎవరి పనో తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.