Social Media Effect: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా అంటే ఒక రకమైన అభిప్రాయం ఉంది. పాజిటివ్ కంటే నెగటివ్ ఎక్కువ వైరల్ అవుతోందనే బలమైన వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియా దుర్వినియోగం అవుతోంది. అయితే, నాణెనికి రెండు ముఖాలు ఉన్నట్లుగానే.. సోషల్ మీడియాలోనూ మంచి, చెడు రెండూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అస్తికరమైన ఘటన వెలుగు చూసింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం స్నేహితులు.. ఓ పేదింటి అమ్మాయికి చేయూతను అందించారు. ఆగిపోయే పెళ్లిని.. ముందుండి జరిపించారు. ఇప్పుడు.. ఈ వివాహమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకెళితే.. రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సింగారపు లక్ష్మణ్ – లక్ష్మీ అనే నిరుపేద దంపతులకు రజిత అనే కూతురు ఉంది. ఇటీవలే రజితకు వివాహం నిశ్చయం అయింది. కానీ ఆర్థిక స్థోమత లేక కూతురు వివాహం ఎలా జరిపించాలో తెలియక ఆ దంపతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక వార్డు సభ్యుడు చెప్యాల గణేష్ అనే వ్యక్తిని కలిసి రజిత వివాహం, ఆర్థిక పరిస్థితి గురించి వివరించారు. ఈ విషయం తెలుసుకున్న గణేష్ సామాజిక సేవలు చేస్తున్న ‘నా కలం అక్షర సత్యం’ ఫేస్ బుక్ పేజీ అడ్మిన్ కు తెలియజేగా.. అడ్మిన్ వెంటనే స్పందించారు. అమ్మాయి దీనగాధ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసి, అలాగే తన టీమ్ సభ్యులు అమ్మాయి వివాహ ఖర్చులకు కోసం సోషల్ మీడియా వేదికగా కాంపెనింగ్ మొదలు పెట్టారు. దీంతో.. దాతలు ముందుకు వచ్చి రజిత వివాహానికి అండగా నిలిచారు. తోచిన వారికి తోచిన విధంగా సహాయం అందించారు. పుస్తే, మట్టెతో పాటు ఇతర పెళ్లి సామాగ్రి అందించారు. కొత్త సంసారానికి కావాల్సిన వస్తువులన్నీ కొనుగోలు చేసి ఇచ్చారు. తోడబుట్టిన అన్నల మాదిరిగా అన్ని వస్తువులు ఇచ్చి రజిత వివాహం ఘనంగా జరిపించారు. అనంతరం వధువు ఇంటిలో విందు ఏర్పాటు చేశారు.
‘నా కలం అక్షర సత్యం’ టీమ్ సభ్యుల అభ్యర్థన మేరకు స్థానిక సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్ పెళ్ళి భోజనాల ఖర్చు, చెలుకల తిరుపతి టెంటు, వంట సామాగ్రి, రుద్రంగి బ్లడ్ డోనర్ వ్యవస్థాపకుడు మరిపెల్లి విశాల్ రిసెప్సన్ స్టేజి ఇలా తలా ఓ చెయి వేసి రజిత వివాహాం ఘనంగా జరిపించారు. దాతలు పంపిన విరాళాలు పెండ్లి ఖర్చుల పోను మిగితా రూ. 1 లక్షా 71 వేలు రజిత తల్లిదండ్రులు సింగారపు లక్ష్మణ్, లక్ష్మీ దంపతులకు వివాహం అనంతరం అందజేశారు. వివాహానికి అన్ని తామై చూసుకున్న ‘నా కలం అక్షర సత్యం’ ఫేస్ బుక్ అడ్మిన్, టీం సభ్యలను గ్రామస్థులు, సోషల్ మీడియా వేదికగా ప్రశంల జల్లు కురిపిస్తున్నారు. మొత్తానికి.. సోషల్ మీడియా స్నేహితులు.. ఓ పేద అమ్మాయి పెళ్లి కి సహాయం అందించారు.
Also read:
Hyderabad: తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ డీజీగా అనిల్ కుమార్..
Adilabad: అడవి తల్లుల గోస.. ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం.. టీవి9 వరుస కథనాలకు స్పందన..