Telangana Panchayat Polling: పంచాయతీ ఎన్నికల్లో ఓటేస్తున్నారా..? ఇది మీ కోసమే..

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. గురువారం తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామాల్లో ప్రజలు ఓటు వేసేందుకు గత కొద్దరోజులుగా ఎదురుచూస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేవారు ఈ విషయాలు తెలుసుకోండి

Telangana Panchayat Polling: పంచాయతీ ఎన్నికల్లో ఓటేస్తున్నారా..? ఇది మీ కోసమే..
Telangana Panchayat Electio

Updated on: Dec 10, 2025 | 9:45 PM

Telangana Panchayat Elections: తెలంగాణలో గురువారం తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అధికారులు పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్దం చేశారు. ఈ ఎన్నికలతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో పోటీపోటీగా జరుగుతున్న ఈ ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల అధికారులు ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఓటర్లకు పలు కీలక సూచనలు జారీ చేశారు.

ఓటర్ ఐడీ లేకపోతే ఏం చేయాలి..?

పంచాయతీ ఎన్నికల్లో ఓటువేయడానికి మీ దగ్గర ఓటర్ ఐడీ లేదా ఓటర్ స్లీప్ లేకపోయినా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. జస్ట్ ఓటర్ లిస్టులో మీ పేరు ఉంటే చాలు. అందులో మీ పేరు ఉండి మీ దగ్గర ఓటర్ కార్డు, ఓటర్ స్లీప్ లేకపోయినా మీరు ఓటు వేయొచ్చు. అందుకోసం మీరు కొన్ని ధృవీకరణ పత్రాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ బుక్‌లు, పెన్షన్ పత్రం, సర్వీస్ గుర్తింపు కార్డు, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్, ఉపాధి హామీ జాబ్ కార్డ్, యూనిక్ డిసేబిలిటీ గుర్తింపు కార్డు వంటివి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

395 స్ధానాలు ఏకగ్రీవం

కాగా తొలి విడతలో భాగంగా 395 స్ధానాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఇక రెండో విడత ఎన్నికలకు సంబంధించి 495 స్ధానాల్లో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటివరకు తనిఖీల్లో రూ.8.2 కోట్లు సీజ్ చేశారు.