AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ వాసులకు నీటి కష్టాలు తప్పవా? ఎల్‌నినో ఎఫెక్ట్‌‌తో జలమండలి అలర్ట్..!

ఎల్‌-నినో ప్రభావంతో హైదరాబాద్‌లో రానున్న వేసవి నీటి ఎద్దడి నివారణకు జలమండలి ముందస్తు చర్యలు చేపడుతోంది. తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించి, నిర్మాణ, పారిశ్రామిక రంగాల్లో శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. 'గ్రీన్ వాటర్ ట్యాంకర్' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో పాటు ప్రైవేట్ ఎస్టీపీల నీటిని సద్వినియోగం చేసుకుంటూ, నీటి భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యం.

హైదరాబాద్ వాసులకు నీటి కష్టాలు తప్పవా? ఎల్‌నినో ఎఫెక్ట్‌‌తో జలమండలి అలర్ట్..!
Hyderabad Water Board
Balaraju Goud
|

Updated on: Oct 16, 2026 | 9:00 PM

Share

హైదరాబాద్‌: రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా హైదరాబాద్‌ జలమండలి ముందస్తు చర్యలు చేపడుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు, భూగర్భజలాల లభ్యతలో తగ్గుదల, జలాశయాలపై ఒత్తిడి పెరిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ నీటి వనరుల వినియోగంపై దృష్టి సారించింది. నిర్మాణ రంగం, పరిశ్రమలు, పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్‌ అవసరాలకు తాగునీటికి బదులుగా శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది.

నవంబర్‌ 1 నుంచి గ్రీన్‌ వాటర్‌ ట్యాంకర్లు

జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి ఆధ్వర్యంలో క్రెడాయ్‌, టీబీఎఫ్‌, నెరేడ్కో ప్రతినిధులతో జరిగిన సమావేశంలో నీటి సంరక్షణ చర్యలపై చర్చించారు. ఇందులో భాగంగా నవంబర్‌ 1 నుంచి ‘డయల్‌-ఏ-గ్రీన్‌ ట్యాంకర్‌’ సరఫరా విధానాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ట్యాంకర్లను బుక్‌ చేసుకోవడం, సరఫరాను ట్రాక్‌ చేయడం వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రోజుకు 500 ఎంఎల్‌డీ వినియోగమే లక్ష్యం

నిర్మాణ ప్రాజెక్టులు, పరిశ్రమలు, పార్కులు, గ్రీన్‌బెల్టులకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు తొలి దశలో రోజుకు 500 ఎంఎల్‌డీ వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమావేశంలో వివరించారు. ఇందుకోసం ఎస్టీపీల నుంచి సమీప ప్రాంతాలకు పైప్‌లైన్లు ఏర్పాటు చేయడం, ఫిల్లింగ్‌ కేంద్రాలను అభివృద్ధి చేయడం, ట్యాంకర్ల రవాణా వ్యయాన్ని తగ్గించే మార్గాలను పరిశీలిస్తున్నారు.

ప్రైవేట్‌ ఎస్టీపీలపైనా దృష్టి

గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలోని ప్రైవేట్‌ మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి మిగులు నీటిని వినియోగంలోకి తీసుకురావాలని జలమండలి నిర్ణయించింది. ఇప్పటివరకు 51 ప్రైవేట్‌ ఎస్టీపీల నమోదు పూర్తయిందని, వాటి నుంచి రోజుకు సుమారు 1.5 ఎంఎల్‌డీ మిగులు శుద్ధి చేసిన నీరు అందుబాటులో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని అధికారులు తెలిపారు.

రానున్న వేసవిలో తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు నిర్మాణ రంగ సంస్థలు, పరిశ్రమలు సహకరించాలని జలమండలి కోరింది. శుద్ధి చేసిన నీటి నాణ్యత, సరఫరా, ధరల విధానంపై మార్గదర్శకాలు రూపొందించి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లనున్నారు. అయితే ఈ ప్రణాళికల అమలు, నీటి లభ్యత ఆధారంగా సరఫరా విస్తరణ ఉండనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us