Eetala Rajendar: భవిష్యత్ కార్యాచరణపై ఈటల కీలక వ్యూహం.. ముందుకు కేసీఆర్ స్పందన రానీయ్ అంటున్న బీసీ నేత

|

May 11, 2021 | 6:50 PM

ఈటెల దారెటు? ఈ అంశం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా.. మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కెసిఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్ తదుపరి నిర్ణయం ఏంటి? ఈ అంశం ఇప్పుడు...

Eetala Rajendar: భవిష్యత్ కార్యాచరణపై ఈటల కీలక వ్యూహం.. ముందుకు కేసీఆర్ స్పందన రానీయ్ అంటున్న బీసీ నేత
Follow us on

EETALA RAJENDAR POLITICAL STRATEGY: ఈటెల దారెటు? ఈ అంశం ఇప్పుడు తెలంగాణ (TELANGANA) వ్యాప్తంగా.. మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కెసిఆర్ మంత్రివర్గం (KCR CABINET) నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్ తదుపరి నిర్ణయం ఏంటి? ఈ అంశం ఇప్పుడు ఏ నలుగురు ఒక చోట గుమికూడినా చర్చనీయాంశంగా కనిపిస్తోంది. 2004 మొదలుకొని తెలంగాణ రాష్ట్ర సమితి (TELANGANA RASHTRA SAMITI) రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన హుజురాబాద్ (HUZURABAD) నేత ఈటెల రాజేందర్ అనూహ్యంగా కేసీఆర్ క్యాబినెట్ నుంచి తప్పించబడ్డారు. కేవలం 48 గంటల వ్యవధిలో ఆపరేషన్ కేసీఆర్ (OPERATION KCR) శీఘ్రగతిన ముగిసిపోయింది. ఈటెల రాజేందర్‌పై కొంతమంది రైతులు భూ కబ్జా ఆరోపణలు చేయడం, ఆయనపై చర్య తీసుకోవాలని కోరడం.. వెంటవెంటనే ముఖ్యమంత్రి (CHIEF MINISTER) విచారణకు ఆదేశించడం జరిగిపోయాయి. ఆ వెంటనే రెవెన్యూ, ఏసీబీ తదితర దర్యాప్తు సంస్థలు శరవేగంగా విచారణను ముగించి.. ముఖ్యమంత్రికి నివేదిక అందించడం జరిగిపోయింది. ఆ నివేదిక ఆధారంగా ఈటల రాజేందర్ నుంచి రాజీనామా కోరతారని అందరూ ఆశించారు. కానీ అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో ఈటల రాజేందర్‌ను క్యాబినెట్ నుంచి తప్పిస్తూ గవర్నర్‌కు సిఫారసు చేశారు. అదే వేగంతో గవర్నర్ (GOVERNOR) కూడా నిర్ణయం తీసుకుని ఈటలను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. ఇదంతా జరిగి వారం రోజులు గడుస్తోంది. ఈ వారం రోజుల్లో కొంతమంది కెసిఆర్ వ్యతిరేకులు, కాంగ్రెస్ నేతలు ఈటల రాజేందర్‌ను కలిసి సంఘీభావం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీ (TRS PARTY)లో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి లాంటి వారు కూడా లీడర్లు కలిసినట్లు కథనాలు వచ్చాయి. ఇవన్నీ ఓ వైపు కొనసాగుతుంటే మరోవైపు ఈటెల తదుపరి అడుగు ఎటువైపు? ఈ అంశంపై కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈటల రాజేందర్ సొంత పార్టీ పెడతారని ఒకవైపు కథనాలు వస్తుంటే.. మరోవైపు ఆయన కాంగ్రెస్ పార్టీ (CONGRESS PARTY)లో కానీ, బీజేపీ (BJP)లో కానీ చేరతారని చర్చ కొనసాగింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా (KARIMNAGAR DISTRICT)లో కీలక నియోజకవర్గమైన హుజురాబాద్ నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు ఈటెల రాజేందర్. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ తెలంగాణ బీసీ నాయకుల్లో ఇప్పుడు కీలకంగా మారారు. అయితే బీసీల నుంచి వ్యతిరేకత రాకూడదన్న ఉద్దేశంతో ఈటెలపై టిఆర్ఎస్‌లోని కీలక బీసీ నేతలతో ఆరోపణలు చేయించారు గులాబీ దళపతి. ఈ వ్యూహం కారణంగానే ఈటెల రాజేందర్ వెనుక బీసీ వర్గాలు ర్యాలీ కాకుండా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దానికి తోడు గత వారం రోజులుగా ఈటెల నర్మగర్భంగా వ్యవహరిస్తున్నారు. ఆయనని ఎవరూ కలుస్తున్నారు? ఏ విషయాలు మాట్లాడుతున్నారు? అనే విషయంలో ఎలాంటి లీకేజీలు కూడా మీడియాకు అందకుండా జాగ్రత్త పడుతున్నారు ఈటల రాజేందర్.

ఈ క్రమంలోనే అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కెసిఆర్ ఆగ్రహానికి గురి కావడం వల్లే తాను రాజకీయంగా ఏకాకిగా మిగిలానన్న కంక్లూజన్‌కు ఈటెల రాజేందర్ వచ్చినట్లు తాజాగా సమాచారం అందుతోంది. గతంలో కెసిఆర్‌తో విభేదించి లేదా ఆయనతో ఢీ అంటే ఢీ అన్నట్టు వ్యవహరించి తెలంగాణ రాష్ట్ర సమితికి దూరమైన నేతలెవరూ చెప్పుకోదగిన స్థాయిలో రాజకీయాలలో రాణించలేదు. ఈ విషయాన్ని ఈటల రాజేందర్ త్వరగానే గ్రహించినట్లు ఆయన అనుచర వర్గంలో చర్చ జరుగుతోంది. కెసిఆర్‌తో విభేదించి టిఆర్ఎస్ పార్టీని వీడిన వారిలో ఒక్క రఘునందన్ రావు మాత్రమే దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఎమ్మెల్యేగా గెలవగలిగారు. మిగిలిన చాలా మంది రాజకీయంగా అనామకులుగానే మిగిలిపోయారు. ఈ క్రమంలో తనపై బర్తరఫ్ వేటు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అమీతుమీకి సిద్దపడ్డా తాను సాధించేది ఏమీ లేదని ఈటెల భావిస్తున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్‌తో ఢీ అంటే ఢీ అన్నట్టు వ్యవహరించి.. టిఆర్ఎస్ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తే తిరిగి ఎన్నిక అయ్యే విషయంలో గ్యారెంటీ లేదని ఈటెల గ్రహించినట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల గడువు ఉంది. ఈలోగా కెసిఆర్ మీద పంతంతో తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తే తిరిగి ఉప ఎన్నికలలో గెలవలేక పోతే వచ్చే రెండున్నర సంవత్సరాలు తనకు గడ్డుకాలంగా మారే ప్రమాదం ఉందని ఈటల భావిస్తున్నట్లు చెబుతున్నారు. కెసిఆర్‌తో పెట్టుకున్న వారెవరూ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పెద్దగా సఫలం అయిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో తాను కూడా కేసీఆర్ మీద పంతానికి పోయి ఎమ్మెల్యే గిరిని వదులుకుంటే తనకు, తన పౌల్ట్రీ వ్యాపారానికి తీరని నష్టమే తప్ప లాభం లేదని ఈటెల వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే కేసీఆర్ అంటే తనకు ఇంకా గౌరవమేనని, ఆయన బాటలోనే రాజకీయాల్లో ఎదిగిన విషయం తాను ఎప్పటికీ విస్మరించలేనని.. తన పట్ల ఏవైనా అపోహలు, అసంపూర్ణ సమాచారం ఉంటే క్లారిటీ ఇవ్వడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనన్న సంకేతాలను ముఖ్యమంత్రి గులాబీ దళపతి చంద్రశేఖర రావుకు ఈటల రాజేందర్ పంపుతున్నట్లు తాజా సమాచారం. కెసిఆర్‌తో రాజీ పడడం తప్ప ప్రస్తుతానికి తనకు వేరే మార్గం లేదని ఈటెల భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కెసిఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే కొందరు నేతలు తనను ఇప్పటికిప్పుడు రెచ్చగొట్టినా.. ఆ తర్వాత తన వెనక నిలిచేదెవరో తెలియదని ఈటల సందేహిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపిలో చేరడం కానీ, కాంగ్రెస్ పార్టీలో చేరడం కానీ లేదా తానే సొంతంగా పార్టీ పెట్టడం కానీ తన ఖజానాకు చిల్లు పెట్టుకోవడమే అవుతుంది కానీ తనకు ఏమాత్రం ప్రయోజనం కాదని ఈటల భావిస్తున్నట్లు ఆయన అనుచర వర్గం తాజాగా మాట్లాడుకుంటుంది. అందుకే కెసిఆర్‌తో రాజీ సంకేతాలను పార్టీలో కీలక నేతల ద్వారా పంపిస్తున్నట్లు తాజా సమాచారం. పార్టీలో ఇప్పటికే ఎంతో కొంత అసంతృప్తిగా ఉన్న నేతలు సైతం ఈటలకు కేసీఆర్‌తో రాజీకి రమ్మని సూచించినట్లు తెలుస్తోంది. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ఈటెల రాజేందర్ కేసీఆర్ అంటే తనకు ఎప్పటికీ అభిమానమేనని, ఆయనతో విభేదించి పోరాటానికి సిద్ధం కావాలని తానెప్పుడూ తల పెట్టలేదని క్లారిటీ ఇచ్చేందుకు కేసీఆర్‌తో సయోధ్య కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజీ సంకేతాలపై కెసిఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి వుంది. కెసిఆర్ స్పందన ఆధారంగానే ఈటల రాజేందర్ భవిష్యత్తు కార్యాచరణ సిద్ధమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈలోగా తను ఏ పార్టీ నాయకులు కలిసిన కూడా కేవలం సూత్రప్రాయ చర్చలకు తప్ప దీర్ఘకాలిక వ్యూహాలకు అవకాశం లేదని ఈటల అనుచర వర్గం భావిస్తోంది. అయితే.. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. కేసీఆర్ ఒకసారి ఎవరినైనా వద్దు అనుకుంటే ఇక రాజీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వరని టీఆర్ఎస్ పార్టీలో ఓ వర్గం భావిస్తోంది. మరి ఈటల విషయంలో ఆయన అదే పంథాను కొనసాగిస్తారా? లేక మెత్తబడతారా అన్నది వేచి చూడాలి.