
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. సాధారణంగా జరిగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కాస్త పోలీసులపై హత్యాయత్నం చేసే స్థాయికి వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది.
మణుగూరులోని తోగ్గుడెం ప్రాంతంలో గల సమ్మక్క-సారక్క గుడి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న సోలెం నాగేశ్వరరావు అనే వ్యక్తిని ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో అతనికి 80 పర్సంటేజ్ అని తేలింది. నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని హెచ్చరించి ఇంటికి పంపించి వేశారు.
పోలీసులు తనపై కేసు నమోదు చేయడాన్ని అవమానంగా భావించిన నాగేశ్వరరావు, ఇంటికి వెళ్ళిన కాసేపటికే పెద్ద వేటకత్తితో తిరిగి వచ్చాడు. “నన్నే ఆపుతారా? నాకే టెస్టులు చేస్తారా? మీ సంగతి చూస్తా” అంటూ కేకలు వేస్తూ పోలీసులపై దాడికి యత్నించాడు. మద్యం మత్తులో ఊగిపోతూ కత్తితో అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు.
నాగేశ్వరరావు దాడి నుంచి పోలీసులు చాకచక్యంగా తప్పించుకున్నారు. వెంటనే అతడిని చుట్టుముట్టి లొంగదీసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడికి ప్రయత్నించడం, ఆయుధంతో బెదిరించడం వంటి తీవ్రమైన ఆరోపణల కింద ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఒక చిన్న తనిఖీ కాస్తా పెద్ద నేరానికి దారి తీసింది.. మత్తులో తీసుకున్న నిర్ణయం వల్ల అతడు జైలు పాలవ్వాల్సి వచ్చింది.
వీడియో ఇక్కడ చూడండి…
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..