
తెలంగాణలోని రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రైతు భరోసా నిధులు ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో యాసంగి సీజన్ మొదలై మూడు నెలలు గడుస్తున్నా.. రేవంత్ సర్కార్ ఇంకా పెట్టుబడి సాయం జమ చేయలేదు. దీంతో సాగుకు పెట్టుబడి పెట్టేందుకు డబ్బుల్లేక రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది గోల్డ్ తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడం లేదా అగ్రికల్చర్ లోన్ వంటివి తీసుకోవడం చేస్తున్నారు. పంట సాగు కోసం అప్పు చేయాల్సి వస్తోందని, ప్రభుత్వం త్వరగా జమ చేయాలని రైతులు డిమాండ్లు చేస్తున్నారు. ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తుండటంతో రైతులు నిరాశలో కూరుకుపోయారు. జనవరిలో రైతు భరోసా జమ చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఈ క్రమంలో రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల అవుతాయనే విషయంపై స్పష్టత వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ పథకం కింద రూ.2 వేల చొప్పున రైతు ఖాతాల్లో జమ చేయనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తైన క్రమంలో ఏ క్షణంలో అయినా రైతులకు నిధులను విడుదల చేయనుంది. ఈ నెల చివరికల్లా 22వ విడత సొమ్మును రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బడ్జెట్ వల్ల పీఎం కిసాన్ నిధుల విడుదల ఆలస్యమవ్వగా.. ఇప్పుడు ఆ పని పూర్తవ్వడంతో ఫిబ్రవరి చివరి వారంలో నిధులను ప్రధాన మోదీ స్వయంగా బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేయనున్నారని సమాచారం. అయితే రైతు భరోసా డబ్బులను కూడా అటుఇటుగా ఫిబ్రవరి చివరి వారంలోనే జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండక్కి ఈ నిధులను విడుదల చేయాల్సి ఉండగా.. సాగులో ఉన్న పంట భూములను గుర్తించే శాటిలైట్ సర్వే ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల జాప్యం జరిగింది.
ఇటీవల శాటిలైట్ సర్వే పూర్తవ్వగా.. ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందించారు. ఈ సర్వేలో ప్రస్తుతం 10 శాతం భూముల్లో పంట సాగు అవ్వడం లేదని వెల్లడైంది. దీంతో ఆ భూములకు రైతు భరోసాను ప్రభుత్వం నిలిపివేయనుందని చెబుతున్నారు. ఇక మిగతా లబ్దిదారులకు రైతు భరోసా సొమ్మును ఫిబ్రవరి చివరికల్లా రిలీజ్ చేయనుంది. ఇంచుమించుగా పీఎం కిసాన్, రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో ఒకేసారి పడే అవకాశముంది. దీంతో రైతులకు డబుల్ బొనాంజా అని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు జమ చేయనుండగా.. తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ.6 వేల చొప్పున విడుదల చేయనుంది. దీంతో ఈ నెలలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బులు చేరనున్నాయి.