
అనారోగ్యం వస్తే డాక్టరును సంప్రదించడం సహజం. కానీ ఆ డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం గూగుల్‌లో వెతికిన ఒక యువకుడికి ఊహించని షాక్ తగిలింది. ఒక్క ఫోన్ కాల్, ఒకే ఒక్క క్లిక్ ఆ యువకుడి బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసింది. కేవలం 24 గంటల్లోనే రూ.4.57 లక్షలు కొల్లగొట్టిన వైనం ఇప్పుడు నగరంలో కలకలం రేపుతోంది. హైదరాబాద్‌కు చెందిన బాధితుడు ఒక ప్రముఖ డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు. అది గమనించిన సైబర్ కేటుగాళ్లు, డాక్టర్ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నామని నమ్మబలికి అతనికి ఫోన్ చేశారు. అపాయింట్‌మెంట్ కన్ఫర్మ్ చేయాలంటే ఒక యాప్ డౌన్‌లోడ్ చేయాలని సూచించారు.
నేరగాళ్లు పంపిన లింక్ ద్వారా Doctors Appointment APK అనే నకిలీ యాప్‌ను బాధితుడు ఇన్‌స్టాల్ చేశాడు. ఆ క్షణం నుంచే అసలు కథ మొదలైంది. ఈ యాప్ ద్వారా బాధితుడి ఫోన్‌పై సైబర్ నేరగాళ్లు పూర్తి నియంత్రణ సాధించారు. బాధితుడికి తెలియకుండానే ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లు, ఓటీపీలను వారు రీడ్ చేయగలిగారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే 57 సార్లు లావాదేవీలు జరిపి భారీగా నగదు మాయం చేసినట్లు విచారణలో తేలింది. ఫోన్ వారి గుప్పిట్లోకి వెళ్లడంతో ఖాతాలో డబ్బులు కట్ అవుతున్నాకొద్దీ బాధితుడికి ఏం అర్ధం కాలేదు. చివరకు మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కాకుండా, బయటి లింక్‌ల ద్వారా వచ్చే APK ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్‌స్టాల్ చేయవద్దని సూచించారు. గూగుల్ సెర్చ్‌లో కనిపించే కస్టమర్ కేర్ లేదా హాస్పిటల్ నంబర్లు అన్నీ నిజమైనవి కాకపోవచ్చని.. అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే చూడాలని చెప్పారు. అనవసరమైన యాప్‌లను వాడొద్దన్నారు. ఇలాంటి మోసాలపై వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.