
హైదరాబాద్‌లోని పాతబస్తీ పరిధిలోని మీర్ చౌక్ ప్రాంతంలో మొహమ్మద్ ఔన్ ఖాన్ అనే ఓ వ్యక్తి వారం క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కానీ కుటుంబ సభ్యుల అప్రమత్తతతో ప్రాణాలతో బయటపడ్డాడు. అతని ఆత్మహత్యకు కారణం తెలుసుకుని కుటుంబ సభ్యులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. పెద్ద గండం తప్పిందని అప్పటికప్పుడు కుటుంబ సభ్యులు భావించినా మొహమ్మద్ ఔన్ ఖాన్ పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. అదే క్రమంలో ఈ రోజు మరోసారి ఆత్మహత్యకు ప్రయత్నించి విషం తాగి ప్రాణాలు కోల్పోయాడు. క్రిప్టో కరెన్సీలో భారీగా డబ్బు పోగొట్టుకున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మీర్ చౌక్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. జరిగిన ఘటనపై కుటుంబ సభ్యుల వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అనంతరం పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు బయటికి వచ్చాయి. మరణించిన మొహమ్మద్ ఔన్ ఖాన్ తన స్నేహితుడు జాన్‌కు క్రిప్టో కరెన్సీని బదిలీ చేశాడు. అయితే, జాన్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. ఔన్ ఖాన్, జాన్ చాలా ఏళ్లుగా స్నేహితులు కూడా. మొహమ్మద్ ఔన్ ఖాన్ ఆస్ట్రేలియాలో జాన్‌ను కలిసిన సమయంలో క్రిప్టో కరెన్సీని తన ఖాతాకు బదిలీ చేయమని జాన్ కోరాడు. అంతేకాకుండా, హైదరాబాద్‌లో అతనికి రూ.1.5 కోట్ల భారతీయ కరెన్సీని ఏర్పాటు చేస్తానని హామీ కూడా ఇచ్చాడు. ఎప్పటి నుంచో వాళ్ల మధ్య స్నేహం అనే బంధం కారణంగా ఔన్ ఖాన్.. జాన్‌ను నమ్మాడు. ఏమీ ఆలోచించకుండా స్నేహితుడు అడిగిన విధంగానే చేశాడు. అయితే అక్కడే ఔన్ ఖాన్ తప్పు చేశాడు. క్రిప్టో కరెన్సీ అందుకున్న తర్వాత జాన్ ఆస్ట్రేలియాలో ఉన్న తన చిరునామాను మార్చుకున్నాడు. దీంతో ఔన్ ఖాన్ తన స్నేహితుడిని సంప్రదించే అవకాశం లేకుండా పోయింది. కొన్ని రోజుల ఎదురుచూపుల తర్వాత తాను మోసపోయానని ఔన్ ఖాన్ గ్రహించాడు. దాదాపు కోటిన్నర డబ్బులను నష్టపోయి నిరాశకు గురై ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే మొదటిసారి కుటుంబ సభ్యుల అప్రమత్తతతో గండం నుంచి బయటపడినా.. కష్టపడి సంపాదించిన డబ్బు చేజేతులారా పోగొట్టుకున్నాననే బాధ ఔన్ ఖాన్‌ను చుట్టుముట్టింది. అదే ఆవేదనతో వారం తిరగకుండానే మరోసారి ఆత్మహత్యకు పూనుకుని చివరికి నిండు ప్రాణాన్ని బలి చేసుకున్నాడు. డబ్బు ఎంతటివారినైనా కష్టాలపాలు చేస్తుందని.. అలాంటి డబ్బుపై అధికంగా వ్యామోహం పెంచుకోకుండా ఉన్నంతలో బతుకుతూ సంతృప్తి చెందాలని ఈ సంఘటన మనకు చెబుతోంది.