రాబోతున్నవి సంక్లిష్టమైన రోజులు.. ఏ మాత్రం అప్రమత్తత లేకపోయినా కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉంది.. ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.. వాటితో పాటే బతుకమ్మ పండుగ.. వారం రోజుల్లో దసరా పండుగ ఉంది.. అటు పిమ్మట దీపావళి… ఆ తర్వాత క్రిస్‌మస్.. పండుగలప్పుడు సరదా అవసరమే కానీ.. ఆ సంబరం వికటించుకూడదు.. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు శ్రీనివాస్, వైద్య విద్యా సంచాలకులు రమేశ్ చెబుతున్నారు.. ప్రజల సహకారంతోనే తెలంగాణలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలమంటున్నారు. పండుగల వేళ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్లక్ష్యం ఏ మాత్రం పనికిరాదని చెబుతూ ఇందుకు కేరళను ఉదహరిస్తున్నారు. కరోనా వ్యాప్తి కట్టడిలో కేరళ అద్భుతంగా కృషి చేసింది.. ప్రశంసనీయపాత్రను పోషించింది.. అయితే ఓనం పండుగ తర్వాత ఆ దేవభూమిలో ఒక్కసారిగా కరోనా విజృంభించింది. కారణం ఓనం పండుగలను ప్రజలు కలిసిమెలిసి జరుపుకోవడమే! భౌతికదూరం పాటించకపోవడమే! ప్రతీ ఏటా పండుగలు వస్తాయి కానీ ప్రాణం పోతే తిరిగి రాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెబుతున్నారు శ్రీనివాస్, రమేశ్‌లు. రాష్ట్రంలో 1500 కేసులు, జీహెచ్‌ఎంసీలో 250లోపు కరోనా కేసులు నమోదవుతున్నాయని వివరించారు. ప్రజల సహకారం వల్లే కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని.. అందుకే తిరిగి ప్రజల సహకారం కోరుతున్నామన్నారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 350మంది కరోనా రోగులు మాత్రమే ఉన్నారనీ, దీన్నిబట్టి వైరస్‌ను ఏ స్థాయిలో కట్టడి చేస్తున్నామో అర్థం చేసుకోవాలన్నారు.