Telangana Election Results 2023: ఒకే గ్రామం, ఒకే కుటుంబం.. తెలంగాణ శాసనసభలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా బ్రదర్స్

| Edited By: Balaraju Goud

Dec 04, 2023 | 7:51 PM

ఆ కుటుంబం, ఆ గ్రామం.. రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆ గ్రామం ఇద్దరినీ ఎమ్మెల్యేలుగా చట్టసభలకు పంపింది. ఒకే గ్రామమే కాదు, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ నేతలు నిత్యం సెన్సేషనల్ కామెంట్స్‌తో రాజకీయాలను ప్రభావితం చేస్తూ.. రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయ నేతలుగా ముద్ర వేసుకున్నారు.

Telangana Election Results 2023: ఒకే గ్రామం, ఒకే కుటుంబం.. తెలంగాణ శాసనసభలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా బ్రదర్స్
Komatireddy Venkatreddy, Rajagopal Reddy
Follow us on

ఆ కుటుంబం, ఆ గ్రామం.. రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆ గ్రామం ఇద్దరినీ ఎమ్మెల్యేలుగా చట్టసభలకు పంపింది. ఒకే గ్రామమే కాదు, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ నేతలు నిత్యం సెన్సేషనల్ కామెంట్స్‌తో రాజకీయాలను ప్రభావితం చేస్తూ.. రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయ నేతలుగా ముద్ర వేసుకున్నారు. ఘనత వహించిన ఆ గ్రామం, ఆ కుటుంబం ఈ ఎన్నికల్లోనూ గెలిచి మరోసారి తన వారసత్వాన్ని చాటుకుంది. ఆ గ్రామం, ఆ కుటుంబం ఎక్కడ ఉంది.. ఆ నేతలు ఎవరో తెలుసు కోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలకు ఓ ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ గ్రామానికి చెందిన వారే. ఈ ఇద్దరూ తోబుట్టువులు. ఈ సోదరలిద్దరూ 2009 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌గా బ్రాండ్ ఇమేజ్ పొందిన వీరికి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమేమి కాదు.

యువనేతగా ప్రజాదరణ పొందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1999లో తొలిసారిగా శాసనసభ్యుడిగా అడుగుపెట్టారు
అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతూ వస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో అనుహ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా మరోసారి సత్తా చాటారు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఇక కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి ఎంపీగా గెలిచారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిపాలైన రాజగోపాల్ రెడ్డి తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2022లో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేశారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 15 నెలల పాటు బీజేపీలో కొనసాగిన రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరి, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు.

ఇదే గ్రామానికి చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుడు చిరుమర్తి లింగయ్య 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నకిరేకల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన చిరుమర్తి లింగయ్య 2018 లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకుని ఈ ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ ఓటమిపాలయ్యారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో ఈ ముగ్గురు నేతలను బ్రాహ్మణ వెల్లంల చట్టసభలకు పంపింది. జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తూ రాష్ట్ర జాతీయస్థాయి నేతలుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ముద్ర వేసుకున్నారు. ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నుంచి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి విజయం సాధించారు. ఇద్దరు రాజకీయ నేతలను అందించిన కోమటిరెడ్డి కుటుంబం, బ్రాహ్మణ వెల్లంల గ్రామం రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. దీంతో ఎన్నికల్లో ఒకే గ్రామం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…