Rahul today schedule: తెలంగాణలో రెండో రోజు రాహుల్ టూర్.. వరంగల్ కామెంట్స్‌పై టీఆర్ఎస్ నేతల అటాక్

|

May 07, 2022 | 9:45 AM

కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ హైదరాబాద్ పర్యటన మరికాసేపట్లో స్టార్ట్‌ కానుంది. రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ఇవాళ రెండో రోజు ముఖ్యనేతలు, విద్యార్థి సంఘాల నేతలతో, తెలంగాణ ఉద్యమకారులతో సమావేశం కానున్నారు.

Rahul today schedule: తెలంగాణలో రెండో రోజు రాహుల్ టూర్.. వరంగల్ కామెంట్స్‌పై టీఆర్ఎస్ నేతల అటాక్
Ktr Rahul
Follow us on

Rahul Gandhi Telangana Tour: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ హైదరాబాద్ పర్యటన మరికాసేపట్లో స్టార్ట్‌ కానుంది. రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ఇవాళ రెండో రోజు ముఖ్యనేతలు, విద్యార్థి సంఘాల నేతలతో, తెలంగాణ ఉద్యమకారులతో సమావేశం కానున్నారు. ముందుగా, తెలంగాణ ఉద్యమకారులతో రాహుల్‌ సమావేశంకానున్నారు. ఆ తర్వాత, సంజీవయ్య పార్క్‌కు వెళ్లి, అక్కడ దివంగత సీఎం సంజీవయ్యకు నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం పన్నెండున్నరకి చంచల్‌గూడ జైల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలను పరామర్శిస్తారు. ఒంటి గంటా 50 నిమిషాలకు గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో సమావేశమై, పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేస్తారు. పార్టీ సభ్యత నమోదు కోఆర్డినేటర్లతో ఫొటో సెషన్ తర్వాత, సాయంత్రం 5:40కి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.

అయితే, హైదరాబాద్‌ టూర్‌లో అత్యంత కీలకమైన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తారా? లేదా? అనేది ఇంకా సస్పెన్స్‌గా మారింది. ఆరునూరైనా రాహుల్‌… ఓయూకి వచ్చితీరుతారంటూ చెప్పిన టీకాంగ్రెస్‌ లీడర్స్‌, షెడ్యూల్‌లో మాత్రం దాన్ని చేర్చలేదు. పర్మిషన్‌ కాంట్రవర్సీతో ఓయూను స్కిప్‌ చేశారా? లేక సడన్‌ విజిట్‌కు ప్లాన్‌ చేశారా? ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అలాగే, ఓయూలో అరెస్టై, ప్రజెంట్‌ చంచల్‌గూడ జైల్లో ఉన్న NSUI కార్యకర్తలతో రాహుల్‌ ములాఖత్‌ కన్ఫ్మామ్‌ అయింది. మధ్యాహ్నం చంచల్‌గూడ జైలుకు వెళ్లనున్న రాహుల్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలను పరామర్శించనున్నారు. అలాగే, తెలంగాణ ఉద్యమకారులతో రాహుల్‌ సమావేశంకానున్నారు.

ఇదిలావుంటే, కాంగ్రెస్‌ పదేండ్ల పాటు చేసిన పాపాలను టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు కడిగేస్తున్నారు. వరంగల్‌ సభ తర్వాత, రాహుల్‌ టూర్‌పై మరోసారి ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్‌. పొలిటికల్‌ టూరిస్ట్‌లు వస్తారు… పోతారు అంటూ ఎద్దేవా చేశారు. కానీ, తెలంగాణలో ఉండేది మాత్రం కేసీఆర్‌ మాత్రమేనంటూ ట్వీట్‌ చేశారు కేటీఆర్‌. కేటీఆర్‌ ట్వీట్‌కు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ అంతే దీటుగా కౌంటర్‌ ఇచ్చారు. కేటీఆర్ దృష్టిలో తెలంగాణ టూరిస్ట్ ప్లేస్‌ అయితే… కాంగ్రెస్‌ దృష్టిలో తెలంగాణ అమరుల త్యాగఫలం అంటూ ట్వీట్ చేశారు రేవంత్. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణను… కేటీఆర్‌ టూరిస్ట్ ప్లేస్‌ అంటున్నారని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ 2018 ఎన్నికల సందర్భంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే ప్రజలు, రైతులు తిరస్కరించారని, ఇప్పుడూ అదే పాత పాట పాడితే ఎవరు నమ్ముతారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని స్వామినాథన్‌ కమిటీ సిఫారసు చేస్తే దాన్ని తొక్కిపెట్టింది యూపీఏ సర్కారేనని తేల్చిచెప్పారు. ప్రజల సుదీర్ఘ పోరాటాలతోనే తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితిని టీఆర్‌ఎస్‌ సృష్టించటం వల్లే కేంద్రం ఇచ్చిందన్న విషయాన్ని మరిచిపోకూడదన్నారు.

ఇవి కూడా చదవండి

రాహుల్ అంత సమర్థుడైతే ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారంటూ ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. కాంగ్రెస్ పార్టీ పొత్తు కోసం ఇతర పార్టీల కాళ్లు పట్టుకొని బతిమాలినా ఎవరూ పొత్తు కోసం సిద్ధంగా లేరన్నారు ఎర్రబెల్లి. కాంగ్రెస్‌ పాలనలోనే పోడుభూముల సమస్య ఉత్పన్నమైందని మంత్రి గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పాలనలోని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరందించిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని ఉద్ఘాటించారు. అటు, రైతులకు రూ.15 వేల ఆర్థిక సహాయం, గిట్టుబాటు ధర అని చెప్పిన హామీలను ముందు కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. చేతనైతే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో 24 గంటల కరెంటు ఇవ్వాలని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ది రైతు ప్రభుత్వమని, రైతును రాజు చేసే ప్రభుత్వమని ఈ దేశమే గుర్తించిందని, అందుకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజనే నిదర్శనమని వెల్లడించారు.

ఎవరో రాసిన చిలుక పలుకులు తప్ప.. రాహుల్‌ మాటల్లో పస లేదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌కు జాతీయ విధానమంటూ ఒకటుందా? అని ప్రశ్నించారు. ఏఐసీసీలు, పీసీసీలు తయారు చేసిన డిక్లరేషన్‌లు కాదు.. అసలు డిక్లరేషన్‌ ఇచ్చే అర్హత రాహుల్‌కు లేదన్నారు. అధికారంలోకి రావాలనే కాంక్ష తప్ప, ప్రజల కోసం కాంగ్రెస్‌ కొత్తగా చేసేదేమీ లేదన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ జాతీయ స్థాయి నాయకులను తీసుకొచ్చి ఇక్కడ జోకర్లుగా మార్చి నవ్వుల పాలు కావడం తప్ప, వారికి ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ హక్కుల కోసం టీఆర్‌ఎస్‌ పోరాడుతుంటే ఎక్కడికి పోయారని రాహుల్‌ గాంధీని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. రాహుల్‌ పర్యటన సందర్భంగా ట్విట్టర్‌లో.. ‘రాహుల్‌గాంధీ జీ.. మీరు కానీ, మీ పార్టీ కానీ ఎన్ని సార్లు పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండి. రాష్ట్ర హక్కుల కోసం టీఆర్‌ఎస్‌ పోరాడుతుంటే మీరెక్కడున్నారు? దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడికి పోయారు? తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, తెలంగాణ రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన పెండింగ్‌ జీఎస్టీ బకాయిలు, నిధుల గురించి టీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు?’ అని కవిత ప్రశ్నించారు.

Read Also…  AP Alliance: ఇద్దరి గమ్యం ఒక్కటే.. మళ్లీ కలిస్తే తప్పేంటి.. జనసేనానికి చంద్రబాబు స్నేహ హస్తం!