Revanth Reddy: ఆ విలన్ల వల్లే నేను హీరో అయ్యా.. TV9 సమ్మిట్‌లో సీఎం రేవంత్ సంచలన కామెంట్స్..

టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ కీలక విషయాలు ప్రస్తావించారు. రావణుడు ఉన్నాడు కాబట్టే రాముడికి అంత పేరు వచ్చింది.. తెలంగాణలో విలన్ల వల్లే హీరో అయ్యాను అంటూ వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం చూపుతున్న వివక్షపై ధ్వజమెత్తారు.

Revanth Reddy: ఆ విలన్ల వల్లే నేను హీరో అయ్యా.. TV9 సమ్మిట్‌లో సీఎం రేవంత్ సంచలన కామెంట్స్..
Cm Revanth Reddy At Tv9 Witt Summit

Updated on: Mar 24, 2026 | 7:50 PM

కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేరళ, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు కేంద్రంలో సరైన ప్రాతినిధ్యం లేదని అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో పాల్గొన్న ఆయన కేంద్రప్రభుత్వం, ప్రధాని మోదీ విధానాలపై నిప్పులు చెరిగారు. మోదీ అనుసరిస్తున్న త్రీ-డి పాలసీని ఎదుర్కోవడానికి దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడును అవమానించారని రేవంత్ అన్నారు. ‘‘వెంకయ్య నాయుడును ఢిల్లీ నుంచి ఎందుకు ఖాళీ చేయించారు? ఆయన్ను ఎందుకు రాష్ట్రపతిని చేయలేదు? మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టారు?” అని బీజేపీని ప్రశ్నించారు. దక్షిణాది నేతలకు కేంద్ర హోం శాఖ వంటి కీలక పదవులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

వారి వల్లే హీరో అయ్యాను

తెలంగాణ పోరాట పటిమ గురించి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ DNA ఇతర ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని.. ఇక్కడి పేదలు, దళితులు నాడు నిజాంకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. రాముడికి పేరు రావడానికి రావణుడు ఎలా కారణమో.. తెలంగాణలో కొంతమంది విలన్ల వల్లే ప్రజలు నన్ను హీరోను చేశారని పరోక్షంగా కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాబోయే ఎనిమిదేళ్ల పాటు తానే తెలంగాణలో ఉంటానని తెలిపారు. తాను కార్యకర్తల మిత్రుడిని.. కార్యకర్తలు తనను అమితంగా ఇష్టపడతారని చెప్పుకొచ్చిన రేవంత్.. తాను దేశ రాజకీయాల్లో ఎప్పుడు పనిచేయాలనేది కేవలం కాంగ్రెస్ అధిష్టానం మాత్రమే నిర్ణయిస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ – గాంధీ కుటుంబంతో అనుబంధం

గాంధీ కుటుంబానికి, తెలంగాణకు ఉన్న విడదీయలేని బంధం ఉందని రేవంత్ అన్నారు. దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీకి వ్యతిరేక గాలి వీచినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 41 మంది ఎంపీలను గెలిపించి అండగా నిలిచామని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే దక్షిణాది నేతలకు రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులు దక్కాయని, ఇండియా ఒక్కటే అనే సందేశాన్ని కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని అన్నారు.

Follow Us