Chicken Prices: నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?

మేడారం జాతర సందడి ఇప్పటినుంచే మొదలైంది. ఇప్పటినుంచే సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు వెళ్తున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి అసలు జాతర ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చికెన్ ధరలు కూడా పెరుగుతున్నాయి. కేజీ ప్రస్తుతం ఎంత పలుకుతుందో తెలుసా..?

Chicken Prices: నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?
Chciken Prices

Updated on: Jan 21, 2026 | 1:35 PM

నాన్ వెజ్ ప్రియులకు చికెన్, కోడిగుడ్ల ధరలు షాకిస్తూనే ఉన్నాయి. సంక్రాంతి పండుగ సీజన్ ముగిసినా ధరలు కిందకు దిగి రావడం లేదు. పండుగ కారణంగా మొన్నటివరకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో చికెన్, మటన్ ధరలు పెరిగాయి. కానీ పండుగ తర్వాత కూడా ధరలు తగ్గకపోవడంతో సామాన్యులపై భారం అధికమవుతుంది. డిమాండ్‌కు తగ్గట్లు కోళ్ల ఉత్పత్తి లేకపోవడమే ధరలు తగ్గకపోవడానికి కారణమని యాజమానులు చెబుతున్నారు. పండుగ తర్వాత ధరలు తగ్గిపోతాయని అందరూ ఊహించారు. కానీ ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో నిరాశ చెందుతున్నారు. దీంతో ధరలు ఎప్పుడు తగ్గుతాయోమోనని సామాన్యులు, నాన్ వెజ్ ఇష్టపడేవారు ఎదురుచూస్తున్నారు.

మేడారం జాతర ఎఫెక్ట్

తెలంగాణలో మేడారం జాతర ఎఫెక్ట్ కూడా చికెన్ ధరలపై పడింది. సమ్మక్క సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించేందుకు కోళ్లను ఉపయోగిస్తారు. అలాగే జాతరకు వెళ్లినవారు అక్కడే వండుకుని కుటుంబసమేతంగా నాన్ వెజ్ తింటారు. జాతరకు లక్షలాది మంది ప్రజలు ఈ సారి తరలిరానున్నారు. అందుకు తగ్గట్లు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ జాతర సందర్భంగా  కోళ్లకు ఫుల్ డిమాండ్ ఉండటంతో వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరో వారం రోజుల్లో జాతర ప్రారంభం కానున్న క్రమంలో చికెన్ ధరలు మరింత పెరగనున్నాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం కేజీ చికెన్ ధర రూ.320 పలుకుతుండగా.. పూర్తిస్థాయిలో జాతర ప్రారంభం అయ్యే సమయానికి రూ.350కి చేరుకునే అవకాశముందని చెబుతున్నారు. దీంతో మేడారం వెళ్లేవారు చికెన్ కొనాలంటే మరింతగా ఖర్చు పెట్టాల్సిందే.

తగ్గని కోడిగుడ్డు

ఇక కోడిగుడ్డు ధరలు కూడా తగ్గడం లేదు. గతంలో ఒక్కో గుడ్డుధర రూ.5గా ఉండగా.. ప్రస్తుతం రూ.8కి చేరుకుంది. ఇక 30 గుడ్ల ట్రే ధర గతంలో రూ.150గా ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.100 పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ట్రే ధర రూ.240 వద్ద కొనసాగుతోంది. గతంతో పోలిస్తే సుమారు 60 శాతం మేర కోడిగుడ్డు ధరలు పెరిగాయి. ఇక రిటైర్ షాపుల్లో ఒక్కో గుడ్డు రూ.8గా ఉండగా.. గ్రామాల్లోని షాపుల్లో రూ.9 పలుకుతుంది. దీంతో గుడ్డు తినాలన్నా జనం భయపడుతున్నారు. అటు ఏపీలో కూడా పండుగ అయిపోయినా చికెన్ ధరలు తగ్గలేదు. పండుగ సందర్భంగా కేజీ బాయిలర్ చికెన్ రూ.320 వరకు ఉండగా.. మటన్ ధరలు రూ.వెయ్యికి చేరుకున్నాయి. ఇక నాటుకోడి చికెన్ కేజీ రూ.2 వేలకు చేరుకుంది.