Weather: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. ఈదురుగాలులు, పిడుగుల బీభత్సం.. అక్కడ ఉండొద్దంటూ వార్నింగ్..

| Edited By: Ravi Kiran

Apr 25, 2023 | 3:51 PM

ఒక వైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. మరోవైపు అకాల వర్షాలు. వాతావరణలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులు.. రైతన్నలను కంటతడిపెట్టిస్తున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట నీటిపాలైంది. లక్షల రూపాయలు పెట్టుబడి వర్షార్పణమైంది.

Weather: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. ఈదురుగాలులు, పిడుగుల బీభత్సం.. అక్కడ ఉండొద్దంటూ వార్నింగ్..
Rains
Follow us on

ఒక వైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. మరోవైపు అకాల వర్షాలు. వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులు.. రైతన్నలను కంటతడిపెట్టిస్తున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట నీటిపాలైంది. లక్షల రూపాయలు పెట్టుబడి వర్షార్పణమైంది.

వడగళ్ల ధాటికి పొలాల్లోనే రాలిపోయిన వరి..

అకాల వర్షాలు అన్నదాతల వెన్నువిరుస్తున్నాయి. మండువేసవిలో అకాల వర్షాలు రైతులను వెంటాడుతున్నాయి. వడగళ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోత దశకు చేరుకున్న వరిపంట వడగళ్ల ధాటికి పొలాల్లోనే రాలిపోయింది. మిరప పంట చేతికందకుండా నీట మునగడంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. మరికొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఒకటి రెండు రోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించాలని చూస్తున్న రైతులకు అకాల వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. ప్రకృతిని నమ్ముకుని పంట సాగుచేస్తున్న అన్నదాతలకు అనేక సందర్భాల్లో వాతావరణం కలిసివస్తున్నప్పటికీ ప్రస్తుత సీజన్‌లో మాత్రం పంటను తడపాల్సిన చినుకే అకాల వర్ష రూపంలో అన్నదాతను చిదిమేస్తోంది.

రైతులకు భారీ నష్టం..

సిద్దిపేట జిల్లాలో నారాయణరావు పేట మండలంలోని మల్యాల, గుర్రాలగొంది, లక్ష్మిదేవిపల్లి, రాఘవాపూర్ పలు గ్రామాల్లో రాళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరిగింది. నర్సంపేట, ములుగు, పాలకుర్తి, వర్ధన్నపేట నియోజక వర్గాల పరిదిలో భారీగా పంట నష్టం జరిగింది. వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. రెక్కల కష్టం వర్షార్పణం అయిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్లతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా కల్పించారు.

ఏపీలోనూ భారీ వర్షాలు..

అటు ఏపీలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. విజయనగరం జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల ఉరుములు, మురుపులతో విరుచుకుపడి బీభత్సం చేసింది. గజపతినగరం గుడివాడ పంటపొలాల్లో పిడుగు పడింది. పిడుగుపాటుకు అప్పలస్వామి అనే రైతుకి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు రెయిన్ అలర్ట్ చేసింది వాతావరణశాఖ. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా చెట్ల కింద ఉండవద్దని కోరారు.

మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..