Kaleshwaram Lift Irrigation Project: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలశక్తి సలహామండలి అనుమతి ఉందని కేంద్రం పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం సొంత ఖర్చుతో నిర్మించినట్టు వివరణ ఇచ్చింది. ఇప్పటివరకు 83.7 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తయినట్టు కేంద్రం వెల్లడించింది.18,25,700 ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించడంతోపాటు మరో 18,82,970 ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ అడిగిన ప్రశ్నకు గానూ.. కేంద్రం గురువారం ఈ వివరాలను వెల్లడించింది. 240 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్టు కేంద్రం తెలిపింది.
ప్రాజెక్టు కింద కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల్, కామారెడ్డి, నిర్మల్, మేడ్చేల్, పెద్దపల్లి జిల్లాల్లో భూములు కొత్తగా సాగులోకి తెచ్చే ప్రతిపాదనతో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని తెలిపింది. ప్రాజెక్టుకు ఇప్పటివరకు 80,321.57 కోట్లు ఖర్చు అయినట్టు వెల్లడించింది. వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సమకూర్చినట్టు కేంద్రం వివరణ ఇచ్చింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలంటూ కోరుతున్న విషయం తెలిసిందే. ఏపీలో పోలవరానికి ఇచ్చినట్లు తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలంటూ రాష్ట్రం కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసిందే.
Also Read: