లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు రెండు రోజు కూడా సుదీర్ఘంగా విచారించారు. ఢిల్లీ లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు కవిత విచారణ జరిగింది. మూడు రోజుల సీబీఐ కస్టడీలో ఉన్న కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. కేటీఆర్‌తో పాటు కవిత భర్త అనిల్ , ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కూడా సీబీఐ కార్యాలయానికి వచ్చారు. కవితకు ధైర్యం చెప్పారు కేటీఆర్.
లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాఫ్ చాట్‌పై సీబీఐ కవితను ప్రశ్నిస్తోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవి పర్యవేక్షణలో సీబీఐ కవితను ప్రశ్నిస్తోంది. సోమవారం కవిత సీబీఐ కస్టడీ ముగుస్తుంది. ఉదయం 10 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరుస్తారు. కవిత కస్టడీని పొడిగించాలని సీబీఐ తరపు న్యాయవాదులు కోరే అవకాశం ఉంది.
మరో మూడు రోజులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. అయితే సీబీఐ వాదనలను కవిత తరపు న్యాయవాదులు వ్యతిరేకించే అవకాశం ఉంది. కవిత అరెస్టు విషయంలో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారని కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. కవిత అరెస్టులో నిబంధనలు పాటించలేదన్నారు. దర్యాప్తుకు సహకరించకపోవడం అరెస్టుకు కారణంగా ఉండొద్దని సుప్రీం కోర్టు గతంలోనే చెప్పిందన్నారు. సెక్షన్ 41 దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…